అనుకున్న దానికన్నా ఎక్కువ కరెన్సీని ముద్రించినట్లు మోడి చెప్పటంలో అర్ధం ఏమిటి?
ఇదీ వరస..ఏదో చేద్దామనుకున్నారు...ఇంకేదో చేసారు. ఏదో చెప్పాలనుకున్నారు... ఏమి చెప్పారో అర్ధం కాలేదు. మన 56 ఇంచుల ఛాతీ కలిగిన ప్రధనమంత్రి నరేంద్రమోడి వరస అలాగే ఉంది. నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేసినపుడు మాట్లాడుతూ, 50 రోజుల్లో సమస్యలన్నీ సర్దుకుంటాయన్నారు.
పైగా సమస్యలు పరిష్కారం కాకపోతే తనను కాల్చి చంపేయమని గట్టిగా చెప్పారు. మోడి చెప్పిన 50 రోజులు డిసెంబర్ 30వ తేదీతో పూర్తయింది.
డిసెంబర్ 31వ తేదీన జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతారన్నారు. దాంతో ఇంత కాలం అనుభవించిన కరెన్సీ కష్టాలకు ఉపశమనం లభిస్తుందని యావత్ దేశం ఎదురుచూసింది. మోడి చేయబోయే ప్రసంగంపైన, చెప్పబోయే ఉపన్యాసంపైన ఎందరో ఎన్నో రకాలుగా ఊహించుకున్నారు.
తీరా డిసెంబర్ 31 రాత్రి మోడి ప్రసంగం విన్న తర్వాత చాలామంది ఉస్సూరుమన్నారు.
గృహరుణాలపై వడ్డీ రేట్లు తగ్గింపు, గర్భిణీల ఖాతాల్లో డబ్బు జమచేయటం, గ్రామాణ, పట్టణ ప్రాంతాల్లో పేదల ఇళ్ళకు రుణాల మంజూరు, సీనియర్ సిటిజిన్ డిపాజిట్లకు వడ్డీల పెంపు, రైతు రుణాలపై మొదటి 60 రోజులు వడ్డీ మినహాయింపు లాంటి వాటిని అసందర్భంగా ప్రకటించారు. నిజానికి పైవన్ని బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో జైట్లీ చెప్పాల్సినవి.
అటువంటి సిల్లీ నిర్ణయాలను కూడా మోడి తన ఘనతలుగా చెప్పుకుంటున్నారంటే తానెంతటి అయోమయంలో ఉన్నారో అర్ధమవుతోంది. పైగా కరెన్సీ గురించి మాట్లాడుతూ, అనుకున్నదానికన్నా ఎక్కువ ముద్రించినట్లు బాంబు పేల్చారు.
ఎందుకంటే, పెద్ద నోట్ల రద్దు సందర్భంగా చెలామణిలో ఉన్న కరెన్సీలో సుమారు రూ. 14.5 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి.
పాత నోట్ల స్ధానంలో కొత్త పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నది కేవలం రూ. 6లక్షల కోట్లేనని స్వయంగా ఆర్బిఐ గవర్నరే చెప్పారు. అంటే డిమాండ్ సప్లై మధ్య అంతరం సుమారు రూ.9 లక్షల కోట్లు. ఈ కారణంగానే దేశంలో జనమంతా నానా అవస్తలు పడుతున్నారు కరెన్సీ కోసం.
అటువంటిది అనుకున్న దానికన్నా ఎక్కువ కరెన్సీని ముద్రించినట్లు మోడి చెప్పటంలో అర్ధం ఏమిటి? ఈ దేశాన్ని మోడి ఏం చేద్దామనుకున్నారో.
