నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి  క్యాష్ లెస్ దెబ్బతగిలింది.  రెండురోజులయినా మానలేదు. మరొక రెండు రోజులు పట్టేలా ఉంది.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేలందరిలో భిన్నమయిన వాడు. 

ఆయన గొంతు అసెంబ్లీలో ఉన్నపుడు తప్ప సాధారణంగా ‘జిల్లా సప్లిమెంట్ ’ దాటదు. కారణం ఆయన నూరుశాతం స్థానిక మనిషి, స్థానిక వార్త.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక రౌండలా వేయండి, దినంలో ఎపుడో ఒకపుడు, ఏదో ఒక కాలనీలోనో, బస్తీలోనో తప్పకుండా స్థానికుల మధ్య తారసబడతాడు. ఇంతగా నియోజకవర్గానికి అతుక్కుపోయిన ఎమ్మెల్యేలు అరుదుగా ఉంటారు.

చడీ చప్పుడు చేయకుండా పనిచేసుకు పోయే శ్రీధర్ రెడ్డి కి ఉన్నట్లుండి ఒక సమస్య వచ్చి పడంది. దీనితో ఆయన వార్త ‘ జిల్లా సప్లిమెంటు ’ దాటుతూ ఉంది. ఆయనకు క్యాష్ లెస్ దెబ్బతగిలింది. రెండురోజులయినా మానలేదు. మరొక రెండు రోజులు పట్టేలా ఉంది.

మొన్ననెల్లూరులో ఆకుతోట వద్ద ఉన్న పెట్రోల్ బంకులో తన వాహనానికి డిజిల్ వేయించుకున్నడు. క్యాష్ లెస్ కదా అనేసి అసెంబ్లీ వాళ్లిచ్చిన అకౌంట్ కు చెందిన ఎస్ బిహెచ్ ఎటిఎం కార్డు వూపేస్తూ ... బిల్లు కొట్టు అన్నాడు. చెప్పినట్లు రు. 2500 లకు బిల్లొచ్చింది. అంతవరకు బాగానే ఉంది. అంతలోనే మేసేజ్ వచ్చింది. కార్డు వినియోగించినందుకు కృతజ్ఞతలు చెప్పారు బ్యాంకు వారు. అదీకూడా బాగానే ఉంది. అయితే, ఆ తర్వాత చదివాకే క్యాష్ లెస్ స్ట్రోక్ తగిలింది. బ్యాంకు వారు కృతజ్ఞతలు చెప్పింది రు.16,000 లు కార్డు ద్వారా వినియోగించుకున్నందుకు.

డీజిల్ వేయించుకున్నది రు. 2500లకు, బ్యాంకు వాళ్లు డెబిటు అయింది రు. 16000లకు. పెట్రోల్ పంపులో విచారిస్తే, వారికి ట్రాన్స్ ఫర్ అయింది రు. 2500 మాత్రమే నని మెసేజ్ చూపించారు.

ఎంతయినా ఎమ్మెల్యే కదా... బ్యాంకుకి ఫోన్ చేసి, ఇదేమిటని అడిగారు. వారు వెంటనే స్పందించి మరొక దెబ్బ వేశారు. డిజీల్ కొన్న ట్రాన్సాక్షన్ లో నిజానికి డెబిట్ అయింది పదహారు వేలు కాదు, రు.23,100( అక్షరాల ఇరవై మూడు వేల ఒక్క నూరు మాత్రమే).

ఇదీ ఎమ్మెల్యేగారి పరిస్థితి. ఆయనకు కొద్ది సేపు వూపిరాడలేదు. తెరుకున్నాక ఇదేమి చోద్యమని అడిగితే, 24 గంటలలో విచారణ చేసి సరిచేస్తామని చెప్పారు.

ఏషియానెట్ తో మాట్లాడుతూ ఇంకాబ్యాంకు వారు అకౌంట్ సరిచేయలేదని శ్రీధర్ రెడ్డి చెప్పారు.

ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే, మామూలు మనిషి విషయంలో పెట్రోల్ పంపు దగ్గిర ఇలా జరిగితే, బ్యాంకు వాళ్లు అంత ఈజీగా ఖాతరు చేస్తారా అని శ్రీధర్ రెడ్డి అడుగుతున్నారు. సాధారణ మనుషుల్ని బ్యాంకుల్లో పలకరించడమే కష్టం. కంప్లయింట్ ఇవ్వండని చెప్పిసాగనంపుతూ ఉంటారు.

కంప్లయింట్ ఇచ్చాక ఎపుడు విచారణ చేస్తారు, ఎపుడు డబ్బు కస్టమర్ అకౌంట్ లో వేస్తారు?

అంతవరకు అతగాడేమి చేయాలి?

క్యాష్ లెస్ అని గోల గోల చేసే ముందు పైలట్ ప్రాజక్టుగా ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని, ఒక వేల ఇలాంటిపొరపాట్లు జరిగితే, కార్డు నుంచి డెబిట్ చేసుకున్నంత వేగంగా మళ్లీ డబ్బు వాపసు వచ్చే అవకాశం ఉండే వ్యవస్థనెలకొల్పాలని ఆయన ఏలిన వారిని కోరుతున్నారు.

అంతవరకు క్యాష్ లెస్ సౌండ్ తగ్గించమని కోరుకుంటున్నారు.