జగన్ పై విమర్శనాస్త్రాలు వదిలిన బాలకృష్ణ తమ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహించిన బాలయ్య

హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ .. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ లో భాగంగా విశాఖ వెళ్లిన బాలకృష్ణ.. బుధవారం నగర టీడీపీ విభాగం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ టీడీపీని ఢీకొట్టడం అంటే.. కొండను ఢీకొట్టినట్టేనని’’ జగన్ ని బాలయ్య హెచ్చరించారు.

టీడీపీ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన లేని కొందరు పాదయాత్రలంటూ బయలుదేరారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. కొందరికి ఇంకా బుద్ధిరాలేదని జగన్ ని ఉద్దేశించి విమర్శించారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన లేని వాళ్లు.. తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

మద్రాసుకు నీరు అందించేందుకు ఎన్‌టీఆర్ ఎలా కష్టపడ్డారో.. అదే విధంగా ఏపీకి నీరు అందించేందు చంద్రబాబు అంతే కష్టపడుతున్నారన్నారు. పట్టిసీమ ద్వారా పంటలకు సాగునీరు అందించిన ఘనత చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందని తెలిపారు. అందుకే ఆయన అపరభగీరథుడని కొనియాడారు.