మంత్రి కామినేనికి అవమానం

మంత్రి కామినేనికి అవమానం

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకి అవమానం జరిగింది. అసెంబ్లీకి వెళ్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకొన్నారు.  ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి గన్ మెన్ లు ప్నశ్నించగా.. వాగ్వాదానికి దిగారే తప్ప.. ముందుకు వెళ్లడానికి  అనుమతించలేదు.

అసలేం జరిగిందంటే.. మంత్రి కామినేని శ్రీనివాసరావు, మరో నలుగురు ఎమ్మెల్యేలు కరకట్ట మార్గంలో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే.. అది సీఎం చంద్రబాబు నివాసం ఉన్న ప్రాంతం కావడంతో అటుగా వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. మంత్రైనా, ఎమ్మెల్యేలైనా కరకట్ట రోడ్డు మార్గంలో అసెంబ్లీకి వెళ్లేందుకు లేదని తేల్చి చెప్పారు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు మంత్రి కామినేని, ఇతర ఎమ్మెల్యేలు రోడ్డుపై ఎదురుచూడాల్సి వచ్చింది.

కాగా.. ఈ విషయంపై స్పీకర్ కోడెల శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. కరకట్ట రోడ్డుపై మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై పోలీసులను వివరణ కోరారు. దీంతో గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అసెంబ్లీకి వచ్చి స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. పోలీసుల తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఆదేశించారు.

గతంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీకి కూడా ఇటువంటి సంఘటనే ఎదురైంది.  గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన కరకట్టపై నుంచి శాసనసభకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో  శివాజీ పోలీసుల వైఖరికి నిరసనగా కరకట‍్ట దగ‍్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నా చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos