ఇవాళ ఉదయం హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాసబ్ ట్యాంక్ ఎన్‌ఎండీసీ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురు విద్యార్థులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు చనిపోగా , మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

 గుడి మల్కాపూర్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతుండటంతో మాసబ్ ట్యాంక్ లోని ఓ టీచర్ వద్ద  ప్రైవేట్ ట్యూషన్ కు చేరారు. వీరు  రెగ్యులర్ గా ఉదయం సమయంలో ట్యూషన్ కు వెళ్లివస్తుంటారు. రోజూ మాదిరిగానే ఇవాళ ఉదయం ట్యూషన్ కి వెళ్లిన యువకులు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో ప్రవీణ్ కుమార్ అనే  విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో విద్యార్థి మృతి చెందాడు. ఇంకో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సిసి కెమెరాల ఆదారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.