Asianet News TeluguAsianet News Telugu

తెలుగోడిని తొలి రాష్ట్రపతి చేయాలనుకున్న గాంధీ ... మరి ఏమైంది..?

బాబు రాజేంద్రప్రసాద్ కంటే ముందు భారత తొలి రాష్ట్రపతిగా తెలుగు నేలకు చెందిన ఓ దళితుడిని నియమించాలనుకున్న గాంధీ కోరిక ఎందుకు నెరవేరలేదు ? ఇంతకీ మహాత్ముడు ప్రతిపాదించిన ఆ ఆంధ్రుడు ఎవరు...?

Mahatma Gandhi wanted a telugu dalit as Indias first President

ఇప్పుడు దేశంలో రాజకీయ చర్చంతా కొత్త రాష్ట్రపతి ఎవరనేదానిపైనే జరుగుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు మహాత్ముడి మనవడు గోపాల కృష్ణ గాంధీని బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో గాంధీ మరో మనవడు రాజ్ మోహన్ గాంధీ తన కొత్త పుస్తకంలో రాష్ట్రపతికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.

 

'Why Gandhi Still Matters: An Appraisal of the Mahatma's Legacy' అనే పుస్తకంలో రాజ్ మోహన్ గాంధీ ... భారత తొలి రాష్ట్రపతిగా ఎవరిని నియమించాలనే దానిపై  మహాత్ముడి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వెల్లడించారు.

 

ముఖ్యంగా దళితుడినే భారత్ తొలి రాష్ట్రపతిగా నియమించాలని మహాత్ముడి భావించారట. అంతేకాదు ఆ వ్యక్తి ఎవరో కూడా సూచించారట.


ఇంతకీ ఆయన ఎవరో కాదు ... మన తెలుగువాడు. పేరు చక్రయ్య. ఈయన గాంధీ స్థాపించిన సేవాగ్రాం ఆశ్రమంలో పని చేశారు.

Mahatma Gandhi wanted a telugu dalit as Indias first President

యువకుడు, మంచి తెలివితేటలున్న చక్రయ్యపై గాంధీకి మంచి అభిప్రాయం ఉండేదట. అందుకే అతడిని దేశానికి తొలి రాష్ట్రపతిని చేయాలని తన సన్నిహితులతో చర్చించారట. కానీ, చక్రయ్య అకాల మరణంతో గాంధీ కోరిక నెరవేరకుండా పోయింది.

 

1947 జూన్ 2 న చక్రయ్య స్మారక ఉపన్యాసంలో గాంధీ మాట్లాడుతూ... చక్రయ్య బతికి ఉంటే ఆయననే రాష్ట్రపతిని చేసేవాడినని చెప్పారట.

 

నాలుగేళ్ల తర్వాత ఇదే విషయాన్ని బాబు రాజేంద్రప్రసాద్ కు కూడా మహాత్ముడు చెప్పారట.

 

అలాగే, 1947 జూన్ లో  ఓ బహిరంగ సభలో గాంధీ మాట్లాడుతూ... ఓ దళిత మహిళ దేశ అత్యున్నత హోదాలో ఉండగా నేను, జవహార్ లాల్ నెహ్రూ, పటేల్ ఆమె కింద పనిచేయాలి అని తన కోరికను వెల్లడించారట.

 

 

అయితే మహాత్ముడి కల నెరవేరడానికి దాదాపు 50 ఏళ్లు పట్టింది. 1997 లో భారత తొలి దళిత రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ్ ఎన్నికయ్యారు.

 

ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా దళిత మహిళను రాష్ట్రపతి ఎన్నికల బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడైనా మహాత్ముడి మరో కల నెరవేరుతుందో లేదో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios