Asianet News TeluguAsianet News Telugu

బొబ్బిలి వీణ గురించి తెలుసా?

  • బొబ్బిలి వీణను పనస,సంపెంగ మొక్కల చెక్కతో చేస్తారు.
  •  మైసూరు వండ్రంగుల దగ్గిర నుంచి బొబ్బిలి  వారు తయారీ నేర్చుకున్నారు
  • సర్వసిద్ధి కుటుంబ బొబ్బిలి వీణల తయారీలో దిట్ట
little known side of bobbili veena

300 సంవత్సరాల క్రితం ఆనాటి బొబ్బిలి సంస్థానాధీశులు మైసూరు సందర్శించారు. మైసూరు సంస్థాన దర్బార్‌లో వీణా కచేరి వినడం తటస్థించింది. ఆనాడు వీణ తయారీలో మైసూరు వడ్రంగులు ప్రత్యేతను చూపించేవారట. అది గమనించిన బొబ్బిలి రాజా తన సంస్థానంలోని ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించి వీణల తయారీలో మెళకువలు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. అదే వీణ తయారీలో బొబ్బిలి రాణించడానికి అంకురార్పణ అయింది.మైసూరు, తంజావూరు వీణలను మూడు కొయ్యముక్కలను కలిపి తయారు చేసేవారు. కానీ బొబ్బిలి వడ్రంగులు మాత్రం ఏకాండీ కొయ్యముక్క (ఒకే చెక్క ముక్క)తోనే వీణను తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. పనస, సంపెంగ చెక్కలతో వీణ చేస్తారు. దేశంలో బొబ్బిలి వీణకున్న పేరు ప్రఖ్యాతులు మరే ప్రాంత వీణలకు లేదు. ఎంతో చరిత్ర కలిగిన బొబ్బిలి వీణకు జియోగ్రాఫికల్‌ గుర్తింపు ఇప్పుడు లభించడం తెలుగు నేలకు గర్వకారణం. బొబ్బిలి సమీపానగల గొల్లపల్లి గ్రామానికి చెందిన సర్వసిద్ధి కుటుంబీకులు వీణల తయారీ సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగించడం విశేషం. వీరి కుటుంబానికి చెందిన సర్వసిద్ధి అచ్చెన్న, చిన్నయ్యలకు ఒకనాడు వీణ తయారీపై వాదం పెరిగి, అదే పందెం వరకూ దారి తీసిందిట. దాంతో అచ్చెన్న 8 నుంచి 10 అంగుళాల పొడవున్న వీణను తయారు చేసి పందెంలో నెగ్గాడట. అటువంటి కుటుంబ చరిత్ర కలిగిన సర్వసిద్ధివారు వీణల తయారీనే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నారు.

1980లో బొబ్బిలి వీణకు జాతీయ అవార్డు లభించింది. సర్వసిద్ధి వీరన్న వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డినుంచి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ బొబ్బిలి వీణకు మురిసిపోయి సర్వసిద్ధి వెంకట రమణను వైట్‌హౌస్‌కు రావలసిందిగా ఆహ్వానించడం చెప్పుకోదగినది. ఈమని శంకర శాస్త్రి వంటి ఎందరో వైణిక విద్వాంసులు బొబ్బిలి వీణలకు ప్రాధాన్యం ఇచ్చేవారు.

బొబ్బిలి వీణ (Bobbili Veena) తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యము. 2011 సంవత్సరంలో ఈ వీణకు భారత ప్రభుత్వం నుండి భౌగోళిక గుర్తింపు (Geographical Indication) లభించింది.

చిన్న బొబ్బిలి వీణ

అలంకరణ కోసం తయారుచేసిన బొబ్బిలి వీణ. ఇప్పుడు మామూలుగా వాయించే వీణలకన్నా, బహుమతులుగా ఇచ్చే చిన్న వీణలకు ఎంతో గిరాకీ ఉంది. ఏటా 300 వరకూ పెద్ద వీణలు బొబ్బిలిలో తయారవుతుంటాయి. విజయనగరం జిల్లా బొబ్బిలితోపాటు బాదంగి మండలం వాడాడలో కూడా వీణలను తయారు చేసే కుటుంబాలు సుమారు 45 వరకూ ఉన్నాయి . వీరు నెలకు 400 వరకూ గిఫ్టు వీణలను రూపొందిస్తున్నారు . ఈ వీణలను లేపాక్షి సంస్థ మార్కెటింగ్‌ చేస్తోంది. గిఫ్టు వీణ తయారు చేయాలంటే రెండు రోజులు పడుతుంది. ఒక్కొక్క గిఫ్టు వీణపై 400 రూపాయిల వరకూ ఆదాయం వస్తుంది. ఇందులో వంద రూపాయిలు పెట్టుబడిగా పోతుంది. అలాగే పెద్ద వీణకు 4 వేల రూపాయిలు పెట్టుబడి పెడితే 5 వేల రూపాయిల వరకూ ఆదాయం వస్తుంది. విదేశాలకు ఈ వీణలు ఎగుమతి అవుతుంటాయి. ఏటా 14 లక్షల రూపాయిల వరకు టర్నోవర్‌ ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios