బాధతో కుచించుకుపోయినా, ఆనందంతో ఉప్పొంగిపోతున్నా, ఒత్తిడితో సతమతమైపోతున్నా.. ఇలా ఎలాంటి భావాన్నైనా ఒకరితో పంచుకోవడానికి వారధిలా ఉండేదే కౌగిలింత. అందుకే మనసుకు ఏ ఫీలింగ్ కలిగినా ఒక్కసారి ఆత్మీయులను ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే బాధలు, ఒత్తిళ్లన్నీ తొలగిపోతాయనేది చాలా మంది నమ్మకం. బాధ, సంతోషం అనే విషయాలు పక్కన పెడితే.. మీ ఆత్మీయులను మీరు ఎటువైపు నుంచి హత్తుకుంటున్నారు. అది అంత అవసరమా.. మేమెప్పుడూ గమనించలేదే అనుకుంటున్నారా.. అయితే ఈ సారి గమనించండి. ఎందుకంటే.. మీరు ఎటు వైపు నుంచి కౌగిలంచుకుంటున్నారనే విషయంపైనే మీ బంధం బలమైనదా.. బలహీనమైనదో చెప్పవచ్చు.

ఇంతకీ విషయం ఏమిటంటే..ఈ కౌగిలింతపై జర్మనీ కి చెందిన కొందరు పరిశోధకులు ఆసక్తికర సర్వే చేశారు. వారి సర్వే ప్రకారం.. సంతోషం, భావోద్వేగం, సానుకూల ధోరణిలో ఉన్నప్పుడు మనము ఎడమవైపున ఎదుటి వ్యక్తిని అమాంతం హత్తుకుంటామట. ఏదో మొక్కుబడిగా, తప్పక కౌగిలించుకుంటున్నాము అనే సమయంలో మన చేతులు కుడివైపుకు వెళ్తాయట. నిజంగా ప్రేమతో వచ్చే కౌగిలింత ఎడమ వైపు నుంచి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. జర్మనీ ఎయిర్ పోర్ట్ లో సుమారు రెండు వేల మందిని పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని వారు తెలిపారు . కనుక  ఈ సారి మీరు ఇతరులను హత్తుకోనేందుకు వెళ్తే.. ఎటువైపు హత్తుకుంటున్నారో ఒకసారి గమనించండి.