కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలమనూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఎడ్లబండిని ఎదురుగా వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బండిలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే బలమనూరుకు చెందిన ఉప్పరి సుబ్బారాయుడు తన కుటుంబంతో కలిసి ఎండ్లబండిపై పొలానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బండి జాతీయ రహదారిపై వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఎడ్లబండి ఎగిరి రోడ్డుపక్కన పడింది. ఈ ప్రమాదంలో సుబ్బారాయుడు, అతడి భార్య నాగలక్ష్మమ్మ తో పాటు వారి కూతురు సుజాత అక్కడికక్కడే మృతి చెందారు. మరో కూతురు సుమతితో పాటు షాకీర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు.  ఈ ప్రమాదంలో రెండు ఎద్దులు కూడా అక్కడికక్కడే చనిపోయాయి.