దొంబిదాసరుల వ్యవస్థ నుంచి వచ్చిన  కుప్పె నాగరాజ్  జ్ఞాపకాలు ఈ పుస్తకం

సామాజిక మాధ్యమం facebook ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి.మనదేశానికి సంబంధించి నిర్భయ చట్టం వెనుకున్న ఉద్యమంలోనూ ప్రధాన పాత్ర దీనిదే...ఇక మన ఆంధ్ర,తెలంగాణాల్లో పెద్దగా సామాజిక ఉద్యమాలు జరగకపోయినా సాహితీ ఉద్యమాలు మొదలయ్యాయి..ఆ మధ్య సాదిక్ అలి ఈ మాధ్యమంలోని స్నేహితుల సహకారంతో తోపుడుబండి అంటూ మొదలు పెట్టి కవితల పుస్తకాలను ప్రజలకు చేరువ చేసాడు.ఇక హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో సగం పైగా సందర్శకులు ఈ మాధ్యమం ద్వారా పరిచయమైన పుస్తకాలను కొనడానికి మిత్రులతో కలిసి వెళుతున్నారనడం అతిశయోక్తికాదు.

ఈ మాధ్యమం ద్వారా పరిచయమైన పూదోట శౌరీలు,బుర్ల సుపర్ణ,మాదాల రమణ,సృజన్,బదరినారాయణ,దేశిరెడ్ఢి మల్లా రెడ్డి,శివ రాచర్ల లాంటివాళ్లు పుస్తక ప్రచురణ చేసున్నారు...వీళ్లంతా ఒక ప్రాంతం కాదు వివిధ రాష్ట్రాల్లో,దేశాల్లో ఉంటున్నవారు. వీరందరూ కలిసి అందిస్తున్న పుస్తకం...ఓ సంచారి అంతరంగం..... 

మనిషికి మతం అవసరమా?మతానికి మనిషి అవసరమా?రెండూ అని చెప్పొచ్చు.సమాజం ఒక క్రమతలో సాగడాని మతం ఒక బంధనంగా ఉపయోగపడితే ఆ బంధాలే ఆ తర్వాత కాలంలో కొందరి ప్రగతికి బంధనాలయ్యాయి.

ప్రపంచంలో అన్ని మతాలనూ అనుసరిస్తూ ఎన్నో వ్యవస్థలు తయారయ్యాయి.ఆ వ్యవస్థల తొలిదశలో వారికి ఎలాంటి సాంఘిక గౌరవం దక్కేదో తెలియదు కానీ కాలక్రమంలో వివక్షకు గురైన విషయాన్ని కాదనలేము.ఉదాహరణకు దేవదాసి వ్యవస్థలాంటివి.

ఇలా వివక్షకు గురైన కులాలూ ఎన్నో ఉన్నాయి.

అప్పట్లో శైవ,వైష్ణవ మతాల ప్రాబల్యం ఉండేది.జనాలు చూద్దామా అత్యధికులు నిరక్షరాస్యులు,ఒకవేళ అక్షరాస్యులున్నా ఇప్పట్లా పేపర్,ప్రింట్ సౌలభ్యం లేదు.అందుకే మత ప్రచారానికి కొందరిని ఉపయోగించుకున్నారు.శైవుల మత ప్రచారకులు బుడగ,బేడ,పూసల,గంటి,పచ్చజంగాలు కాగా వైష్ణవ ప్రచారకులు చెన్నదాసర్లు,మాలదాసర్లు,తడికదాసర్లు,చక్రవాద్య దాసర్లు.బిన్న అరాధనా పద్దతులున్నప్పుడు వారిమధ్య కలహాలు సహజం,ఆ పోరాటాల్లో పాలుపంచుకోవడానికి మరికొందరు..ఒకరు మల్ల జంగాలు కాగా మరొకరు దొంబి దాసర్లు.దొమ్మీ చేసే దాసర్లు దొంబిదాసర్లు అయ్యారని సమాజశాస్త్రవేత్తల సిద్ధాంతం.

ఈ దొంబిదాసరుల వ్యవస్థ నుంచి వచ్చిన "కుప్పె నాగరాజు" జీవితంలోని కొన్ని జ్ఞాపకాలే ఈ "ఓ సంచారి అంతరంగం" పుస్తకం.

ఆకాశం కిందున్న నేలంతా వీళ్లదే..సంచార జీవితాలు...కొన్ని కుటుంబాలు కలసి స్థిరత్వంలేకుండా సంచరిస్తూ గ్రామాల వెలుపలో,గ్రామాల్లో ఎవరింటి పంచనో బతికేస్తారు.

ఇంత విశాలమైన భూమ్మీద అర చేయి స్థలం లేని వాళ్లమంటూ రచయిత మొదలుపెడతాడు.నుదుటికి విబూతి పెట్టుకుని తలపాగా,తెల్ల చొక్కా,పంచె..ఎవరో ఇచ్చిన పాతకోటు తొడిగి చేత్లో తంబూరా పట్టుకుని బయలుదేరుతారు.చిట్కా వైద్యాలు,రోగులకు రక్షరేకులు కట్టడం,గవ్వలు వేసి ముహూర్తం నిర్ణయించడం,తప్పిపోయిన పశువుల జాడ చెప్పడం లాంటి పనులు చేస్తారు.సాయంత్రం మళ్లీ నివాసానికి తిరిగొచ్చేప్పుడు ఒర్రివారి భిక్ష కాకుండా పిట్టలనో,ఉడుతలనో,తాబేళ్లనో ఆహారంగా పట్టి తెచ్చుకోవడం దైనందిన కార్యక్రమం.ఇక ఏ ఊరివారన్నా పిలిస్తే వెళ్లి వీరు రూపొందించ్కున్న ప్రహ్లాద,శనిమహత్యం,గంగ-గౌరి,కంసవధ నాటకాలు ప్రదర్శించడం,ఔత్సాహికులకు ఆ నాటకాలు నేర్పడం.

కరువు కాటకాలొస్తే మరో ప్రాంతానికి తరలి వెళ్లడం.ఇలాంటి ఒక కాలంలో కొడగునాడు వెళ్లడం,అక్కడ జలగలు పట్టడం,అలవాటులేని కాఫీ తోటల పనికిపోయిన తల్లి జారిపడి అస్వస్థతకు గురైన సందర్భాలున్నాయి.నాటకాల్లో విదూషకుడి(కోడంగి) పాత్ర ధరించే రచయిత తండ్రి సింగయ్య పేరు చివరికి రికార్డుల్లో కోడంగయ్యగా మారింది.

చివరికి ఒక ప్రాంతంలో ఇల్లపట్టాలిచ్చినా మంచినీళ్లకూ కొరతే.పొలంగలావిడనడిగి చిన్న దిగుడుబావి తవ్వుకుంటే ఓ పెద్దమనిషి దాన్ని మలవిసర్జన తర్వాత కడుక్కోవడానికి వాడుకునే సంఘటన కలవరపెడుతుంది.

పూట గడిచేదే కష్టమైన వీరికి ఇక చేతిలో డబ్బెక్కడివి?రచయిత పిన్నమ్మ ఒక ఊరిలో దేవతకు ముక్కుచెల్లించుకుంటున్నాను రమ్మంటే చేతిలో చిల్లిగవ్వ లేని తండ్రికొడుకులు 40 కి.మీ నడచివెళ్లడం...ఇలా వారిజీవితాల్లో ఎన్నో సంఘటనలు...

కులాచారం తప్పి పక్క కులాల్లో పెళ్లి చేసుకున్నవారిని శుద్ధి చేసి కులంలో చేర్చుకోవడం,కులపంచాయితీలు,పెళ్ళ్లళ్లలో కట్టుబాట్లు దాటనివారికే తాంబూలాలు ఇవ్వడంలాంటి వారి సమాజ కట్టుబాట్లను వివరిస్తాడు రచయిత.

వీధి బడి నుంచి పక్క గ్రామంలో ఉన్న సంక్షేమ హాస్టల్లో చేరడం....రెండుపూటలు మాత్రమే తిని అర్ధాకలితో గడపడం,సంతలో మోజుపడి తల్లితో పాత ప్యాంట్ కొనడం చివరికి 7వ తరగతి పాస్ అవ్వడం..ఆ తర్వాత మరో హాస్టల్ చేరిన తర్వాత కులం గురించి మొదటిసారి సమస్య తలెత్తుతుంది...sc,st ల్లో దేనికి చెందవు,మీ కులం సంచార,అర్ధసంచార తెగలవాళ్లని సర్టిఫికెట్ ఇస్తారు...మొదటిసారి ఆ మాట విన్న రచయిత దాన్ని కాగితమ్మీద రాయించుని తెచ్చి హాస్టల్ వార్డెన్ కు చూపుతాడు.చుట్టుపక్కల రెండు గ్రామాల్లో పదో తరగతి ఉత్తీర్ణుడైన మొదటి వ్యక్తి ఈ రచయితే..హాస్టల్ జీవితంలో అలవాటైన సినిమా పిచ్చి,కొందరు కుర్రాళ్లు రహస్యంగా చూసి దెబ్బలు తిన్న గుప్తజ్ఞానం సినిమా సంఘటనలు ఉన్నాయి..ఆ తర్వాత పి.యు.సి కి హాస్టల్లో చేరడం....దళిత ఉద్యమాల పట్ల ఆక్షర్షితుడు అయిన వైనం ఉంది...

అప్పటి ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ కాలంలో ఈ తెగ ప్రజలను backward tribe కింద మార్చినందున హాస్టల్ లో ఉండకుండా ఇంటి నుంచే చదవల్సి వచ్చింది..కొత్తగా పెళ్లైన అన్న కాఫీతోటల పనికి పోగా కాలేజ్ సమయం తర్వాత పశువులను కాచే పని చేస్తూ పుస్తక పఠనం సాగించాడు రచయిత..ఆ సమయంలోనే కువెంపు,భైరప్ప,అనంతమూర్తి ల సాహిత్యం గురించి తెలిసిందంటాడు....అంబేడ్కర్ రాసిన పుస్తకాన్ని దొంగిలిస్తూ పట్టుబడి రెండేళ్లు కోర్టుకు తిరిగిన వైనం వివరించాడు...తన పెళ్లి చొక్కాను తమ్ముడు కాలేజ్ కు వెళ్లే సమయంలో ఇచ్చిన అన్నను మరవలేనంటాడు రచయిత..అంతేకాకుండా తమ నివాసాలకు,గృహాలకు విద్యుత్ సౌకర్యం తెప్పించిన తృప్తిని మరవలేనటాడు.

తొలిసారి ఒక సంచార తెగకు చెందిన ఈ రచయిత ద్వారా మనకు వారి జీవన విధానం తెలుస్తుంది.

ఇక వీరి మూలాలన్నీ తెలుగు ప్రాంతానివే....ఇల్లలో మాట్లాడేది తెలుగే....వారి మధ్య సంభాషణలను వారి మాండలీకం లోనే ఇచ్చారు.ఈ కథల నేపధ్యం 1970-77 ప్రాంతం....

సంచార,అర్ధసంచార తెగల జనాన్ని సంఘటితపరచి వారి హక్కులకోసం పోరాడుతున్నారు రచయిత.వీరి ఈ పుస్తకం "అలెమారియ అంతరంగ" కన్నడ సాహిత్య అకాడమి పురస్కారంతో పాటూ ఎన్నో ప్రశంసలను పొందడమే కాకుండా ఇందులోని కొన్ని భాగాలు పాఠశాల,విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు.