కోడెల సైకిల్ ని ఢీకొట్టిన బైక్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ చేపట్టిన సైకిల్ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఆయన సైకిల్ ని బైక్ ఢీకొనడంతో ఆయన కిందపడిపోయారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే..రేపు( ఏప్రిల్ 20వ తేదీ) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన దీక్షకు మద్దతుగా గురువారం కోడెల సైకిల్ యాత్ర ప్రారంభించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తన నివాసం నుంచి కోటప్పకొండకు ఈరోజు ఉదయం కోడెల సైకిల్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలో అనేకచోట్ల నేతలు కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు.

ఆయన సైకిల్‌ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. యలమంద వద్ద ఓ ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి స్పీకర్‌ సైకిల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న నేతలంతా కోడెలను వెంటనే పైకి లేపి సపర్యలు చేశారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిసేపు సేదదీరిన అనంతరం కోడెల తన యాత్రను తిరిగి కొనసాగించారు.