కేరళ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ని  సందర్శించనున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి విదేశీ మోజు ఎక్కువ అన్న విషయ అందరికీ తెలిసిందే. అందుకే ... ఏపీలో ఒక భవనం కట్టాలన్నా, ఏదైనా సిటీని అభివృద్ధి చేయాలన్నా.., రాష్ట్రానికి ఏదైనా టెక్నాలజీ తేవాలన్నా ఇలా ఏది చేయాలన్నా.. ఆయనకు విదేశాలే స్ఫూర్తి. రాష్ట్రానికి రాజధాని కట్టాలి అంటే.. సింగపూర్ లాగా ఉండాలంటారు. రాజధాని డిజైన్లకేమో జపాన్ కావాలి. అమరావతి స్విస్ ఛాలెంజ్ నిర్మాణానికి సింగపూర్ వాళ్లు కావాలి. ఇప్పటి వరకు రాజధాని నిర్మాణానికి పునాది రాయి కూడా వేయలేదు కానీ.. ‘ రాజధాని డిజైన్లు ఎప్పటికీ నూతనంగా ఉండాలి. వెయ్యేళ్ల తర్వాత కూడా అమరావతి కొత్తగా కనిపించాలి. తెలుగువారందరూ గర్వపడేలా ఉంటుంది’ అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అంతెందుకు వ్యావసాయాన్ని ఎలా చేయాలో కూడా విదేశాల నుంచే నేర్చుకోవాలని చెబుతుంటారు.

అంతెందుకు మొన్నటికి మొన్న.. ఏపీలో కొరియన్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దక్షిణకొరియాలోని బూసాన్ తరహాలో ఏపీలో ఓ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందు కోసం ఆ దేశ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. ఈ కొరియన్ సిటీ నిజంగా ఏర్పాటు చేస్తారో లేదో తెలీదు కానీ.. ఆ సిటీ ఏకంగా నిర్మించినంత బిల్డప్ ఇచ్చేశారు సీఎం.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. తాజాగా.. చంద్రబాబు కేరళ వెళ్లారు. ఎందుకో తెలుసా..? అక్కడ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఉంది. దేశంలోనే ది బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ గా దానికి పేరు కూడా ఉంది లేండి. అందుకే ఇప్పుడు దానిని సందర్శించడానికి చంద్రబాబు అక్కడికి వెళ్లారు. ఆ కన్వెన్షన్ సెంటర్ ని దుబాయికి కంపెనీలు నిర్మించాయి. అంటే.. ఇప్పుడు దానిని పరిశీలించిన తర్వాత చంద్రబాబు.. దానిని కట్టిన దుబాయి సంస్థలను సంప్రదిస్తారనమాట. ఇందుకోసం ఓ పదిసార్లైనా ఆయన దుబాయి వెళతారు. ఇక్కడి అధికారులను ఓ పదిసార్లు దుబాయి పంపిస్తారు.

ఏపీలో ఇంకేదైనా కట్టడం కడితే.. దానిని ఆ దుబాయి సంస్థకు అప్పజెప్పాలనేది చంద్రబాబు అభిలాష కాబోలు. అందుకే కేరళకు రెండు రోజుల టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఎలాగు శని, ఆదివారాలు రెండు రోజులూ అసెంబ్లీకి సెలవు కాబట్టి... ఈ సమయంలో ఆ కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత.. కేరళకు లాగానే ఏపీలో కూడా ఓ కన్వెన్షన్ సెంటర్ కట్టేస్తాం అని చంద్రబాబు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.