తిరువనంతపురం: తన భార్యకు జీవించే హక్కు లేదని అంటూ ఓ వ్యక్తి తన భార్యను అందరూ చూస్తుండగా చంపేశాడు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఆమెను హత్య చేశాడు. కేరళలోని చెంగళూర లో ఆదివారం ఈ దారుణమైన సంఘటన జరిగింది. 

త్రిసూర్ కు చెందిన జీతూ నెల రోజులుగా భర్తకు దూరంగా ఉంటోంది. విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. తనకు న్యాయం చేయాలని కోరడానికి ఆదివారంనాడు తన తండ్రితో కలిసి చెంగలూరులోని కుదుంబశ్రీ కార్యాలయానికి వచ్చింది. 

ఆ కార్యాలయం ఆమె భర్త విరాజ్ ఇంటికి సమీపంలోనే ఉంటుంది. దాంతో అతను కోపంతో అక్కడికి చేరుకున్నాడు. కార్యాలయం నుంచి బయటకు వస్తున్న జీతూపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఏం జరుగుతుందో గమనించేలోగానే అతను అక్కడి నుంచి పారిపోయాడు. 

అతను పారిపోతూ ఓ లేఖను అక్కడి వదిలిపెట్టాడు. ఆమెకు బతికే హక్కు లేదు కాబట్టి చంపేశానని అందులో రాసినట్లు పోలీసులు చెప్పారు. జీతూ తనను మోసం చేసిందని, పెద్ద యెత్తున అప్పులు చేయించిందని ఆ లేఖలో చెప్పాడు. తాను కూడా ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నట్లు అందులో రాశాడు. 

రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన జీతూ సోమవారం నాడు మరణించింది. దీంతో పోలీసులు విరాజ్ పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. అతను స్థానికంగా వెల్డింగ్ పనులు చేస్తూ ఉండేవాడు. 

తన భార్య వేరొకరితో ఉండడం చూసినప్పటి నుంచి జీతూతో గొడవ పడుతూ వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెల రోజుల క్రితం వారిద్దరు గొడవ పడ్డారు. అప్పుడు వారిద్దరినీ స్టేషన్ కు తీసుకుని వచ్చి సర్దిచెప్పారు. అయితే, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటామని చెప్పారు. కానీ జీతూను చంపాలని అప్పటి నుంచే చంపాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు.

నేరం జరిగిన చోట ఉన్న చూస్తూ ఉండిపోయినవారిని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.