బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాకపోతే ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయంపై జెడిఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ సస్పెన్స్ లోనే పెట్టారు. ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయాన్ని ఆయన ఎంతగా ప్రశ్నించినా చెప్పలేదు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఏ పార్టీకి కూడా మెజారిటీ రాకపోతే బిజెపి, కాంగ్రెసుల్లో దేనికి మద్దతు ఇస్తారని అడిగితే తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విశ్వాసం తనకు ఉందని మాత్రమే చెప్పారు. 

ఏ పార్టీకి కూడా అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ రాదని ప్రీ పోల్ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో తాను ప్రీ పోల్ సర్వేలను విశ్వసించబోనని దేవెగౌడ అన్నారు. తమకు ఉత్తర కర్ణాటకలో, హైదరాబాద్ కర్ణాటకలో, పాత మైసూరు ప్రాంతంలో మంచి స్పందన లభిస్తోందని చెప్పారు.

మంగళవారం ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ తనను ప్రశంసించడంపై ఆయన స్పందించారు. మోడీ స్మార్ట్ మ్యాన్ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని నాయకుల నుంచి నిఘా విభాగం నుంచి మోడీ అభివృద్ధిపై సమాచారం తీసుకుంటారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో మోడీకి తెలుసుని, అందుకే తనను ప్రశంసించారని అన్నారు. మోడీ చెప్పింది నిజమని, అయితే మోడీతో తనకు విభేదాలు లేవని కాదని అన్నారు. 

మోడీని తాను నాలుగైదు సార్లు కలిశానని, రైతు సమస్యలను పరిష్కరించాలని కోరానని, తన మాటలు విన్నారని, కానీ ఏ విధమైన సాయం కూడా అందించలేదని ఆయన అన్నారు.