ప్లీజ్! కన్నడం లేదా ఇంగ్లీష్: బిజెపి నేతకు సిద్ధూ కౌంటర్

Kannada or English, Don't understand Hindi: Siddaramaiah tells BJP leader
Highlights

ప్లీజ్! కన్నడం లేదా ఇంగ్లీష్: బిజెపి నేతకు సిద్ధూ కౌంటర్

బెంగళూరు:  కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండు సీట్ల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో బిజెపి నేత పి. మురళీధర రావు ఆయనపై ఓ వ్యాఖ్య చేశారు. దానికి సిద్ధరామయ్య నేరుగా సమాధానం ఇవ్వకుండా తనదైన రీతిలో స్పందించారు. 

రెండు సీట్ల నుంచి పోటీ చేయడంపై మురళీధర్ రావు హిందీలో చేసిన ట్వీట్ కు సిద్ధరామయ్య ప్రతిస్పందిస్తూ కన్నడంలో గానీ ఇంగ్లీషులో గానీ ట్వీట్ చేయాలని సూచించారు. 

మైసూరులోని చాముండేశ్వరి సీటు నుంచి ఓడిపోతానని సిద్ధరామయ్య భయపడుతున్నారా, అందుకే బాదామిలో కూడా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారా అని కర్ణాటక బిజెపి వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరిస్తున్న మురళీధర్ రావు ప్రశ్నించారు. 

రెండు సీట్లలో మీరు ఓడిపోవడమే కాకుండా కర్ణాటక యావత్తు కాంగ్రెసు నుంచి విముక్తి అవుతుందని ఆయన అన్నారు. దానికి సిద్ధరామయ్య సమాధానం ఇస్తూ "సార్, కన్నడంలో లేదా ఇంగ్లీషులో ట్వీట్ చేయండి. హిందీ అర్థం కాదు" అని అన్నారు. 

సిద్ధరామయ్య ఈ నెల 24వ తేదీన ఉత్తర కర్ణాటకలోని బాదామీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మైసూరులోని చాముండేశ్వరిలో ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. మే 12వ తేదీన కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. 

తాను చాముండేశ్వరి సీటు నుంచి పోటీ చేస్తానని కాంగ్రెసు అధిష్టానానికి చెప్పానని, అయితే బాదామి నుంచి పోటీ చేయాలని బాగల్కోట్, బిజాపూర్ జిల్లాల నుంచి ఒత్తిడి వచ్చిందని సిద్ధరామయ్య చెప్పారు. దాంతో తాను బాదామి నుంచి పోటీ చేయడానికి తలొగ్గినట్లు తెలిపారు. 

బాదామిలో కురుబ సామాజిక వర్గం బలమైంది. సిద్ధరామయ్య ఆ సామాజిక వర్గానికి చెందినవారే. చాముండేశ్వరిలో విజయం అంత సులభం కాదని గ్రహించిన ఆయన బాదామి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 

ఇంతకు ముందు చాముండేశ్వరిలో సిద్ధరామయ్య రెండు సార్లు ఓటమి పాలయ్యారు, ఐదుసార్లు గెలిచారు. ప్రస్తుతం ఆయన మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సీటును ఆయన కుమారుడు యతీంద్రకు కేటాయించారు.  

loader