ఉచిత కరెంట్ ఇస్తానంటూ జగన్ హామీ

jagan offers free current if he wins the coming elections
Highlights

  • కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న జగన్
  • మహిళా సదస్సు నిర్వహించిన జగన్
  • తరలివచ్చిన మహిళలు
  • వరాల జల్లు కురిపించిన జగన్

ఏపీ ప్రజలకు ప్రతిపక్ష నేత జగన్ వరాల జల్లు కురిపించారు. సన్న, చిన్నకారు కుటుంబీకులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తానని ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం  హుసేనాపురంలో  మహిళా సదస్సు నిర్వహించారు. మహిళా సదస్సుకి చుట్టుపక్క గ్రామాల మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్.. మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

‘‘పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ను ఉచితంగా చదివిస్తాం. హాస్టల్‌ ఫీజు కోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. అధికారంలోకి వస్తే పెన్షన్లను రూ.2వేలకు పెంచుతాం. పెన్షన్‌దారుల వయసు 45 ఏళ్లకు తగ్గిస్తాం. పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం’’ అని జగన్‌ వారాలు కురిపించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెప్తున్నారని, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు అవస్థలు పడ్డారని జగన్ మండిపడ్డారు.

రైతులు, డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆయన ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, అధికారంలోకి రావడానికి చంద్రబాబు అడ్డమైన హామీలిచ్చారని జగన్‌ దుయ్యబట్టారు. జ‌న్మ‌భూమి క‌మిటీల్లాగా కాక గ్రామాల‌లో సెక్ర‌టేరియ‌ట్‌ల‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సెక్ర‌టేరియ‌ట్‌ల‌లో ఆయా సామాజిక వ‌ర్గాల నుంచి ప‌ది మంది ఉద్యోగులను కేటాయిస్తామని..వారే దగ్గరుండి ప్రజల సమస్యలు నెరవేరుస్తారని చెప్పారు.

పొదుపు సంఘాల అప్పును నాలుగు కంతుల‌లో చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మద్యాన్ని నిషేధిస్తామన్నారు. ఈ హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే మళ్లీ ప్రజల మద్దతు అడుగుతానని చెప్పారు.

loader