జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహించిన జగన్
జగన్ ప్రజా సంకల్పయాత్ర నాలుగో రోజుకి చేరుకుంది. ఈ పాదయాత్రలో భాగంగా గురువారం జగన్.. ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గమైన జమ్మలమడుగులో ప్రవేశించారు. ఆయన అడుగుపెట్టాడని తెలియగానే.. స్థానికులు ఊహించని స్థాయిలో తరలివచ్చారు. జగన్ కి మహిళలు హారతులు పట్టి.. వీరతిలకం దిద్దారు. స్థానికులంతా ఆయనకు బ్రహ్మరథం పట్టారు.

స్వాగత కార్యక్రమాల అనంతరం జగన్ నియోజకవర్గంలోని వై.కోడూరు జంక్షన్ లో జగన్... రైతులతో ముఖా ముఖి నిర్వహించారు. పంటలు పండక, గిట్టు బాటు ధర లభించక వారు పడుతున్న కష్టాలను రైతులు జగన్ కి వివరించారు.
గత ఏడాది మినుములు క్వింటాల్‌కు రూ. 13,700 ధర ఉండగా.. ఇప్పుడు కేవలం రూ. 3,700 మాత్రమే ఇస్తున్నారని రైతులు తెలిపారు. అదేవిధంగా ధనియాల ధర గత ఏడాది సుమారు రూ. నాలుగువేలకుపైగా ఉండగా.. ఈ ఏడాది రూ. 1800, రూ. 1900లకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శెనగల ధర కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఆరోపించారు. తమ వద్ద నుంచి బ్రోకర్లు కొనుగోలు చేసిన తర్వాత పంట ధర అమాంతం పెరిగిపోతోందని తెలిపారు.

వారి బాధలను విన్న.. జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రైతులను ఆదుకుంటామని చెప్పారు. ప్రతి పంటకు సరైన మద్దతు ధరలను ముందుగానే నిర్ణయిస్తామని చెప్పారు. పంటలకు మద్దతు ధర కల్పించేందుకు రూ. ఐదువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు.. ఇందుకు రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ, ఇన్ సూరెన్స్ లు కూడా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇచ్చిన రుణ మాఫీ డబ్బులు వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. రుణ మాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు.
