Asianet News TeluguAsianet News Telugu

బోసి నవ్వుల బాపు బొమ్మ... పెద్ద నోటుపై ఎందుకు లేదమ్మా ?

భవిష్యత్తులో పెద్ద నోట్లపై గాంధీ బోసి నవ్వులు కనిపించకపోవచ్చు. ఆయన నవ్వులు కమలనాథులకు కాంగ్రెస్ నవ్వుల్లా కనిపించి ఉండవచ్చు. అందుకే ఆ నవ్వులను మాయం చేసే ఏదో కుట్ర జరుగుతోందని అనుమానం వస్తోంది.

is nda govt ignoring mahatma gandhi

 

దేశ చరిత్రలోంచి  గాంధీ పేరును సమాధి చేసే కుట్ర జరుగుతోందా ...  స్వాతంత్ర్య సమరంలో మహాత్ముడి పాత్రను మరుగున పరిచే ప్రక్రియ కొనసాగుతోందా..

 

గాంధీ వల్లే దేశానికి స్వాతంత్ర్యం రాకపోవచ్చు..కానీ, గాంధీ మార్గం వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనేది చాలా మంది ఒప్పుకునే సత్యం.

 

అందుకే దేశం ఆయనను మహాత్ముడిగా కొలిచింది. పచ్చ నోటుపై పచ్చబొట్టులా బోసినవ్వుల గాంధీని ముద్రించికొని మననం చేసుకుంటుంది.

 

కానీ, భవిష్యత్తులో పెద్ద నోట్లపై గాంధీ బోసి నవ్వులు కనిపించకపోవచ్చు. ఆయన నవ్వులు కమలనాథులకు కాంగ్రెస్ నవ్వుల్లా కనిపించి ఉండవచ్చు. అందుకే ఆ నవ్వులను మాయం చేసే ఏదో కుట్ర జరుగుతోందని అనుమానం వస్తోంది.

 

దీనికి కారణం ఏంటంటే...

గాంధీ బొమ్మ లేని కొత్త కరెన్సీ నోట్ల కట్టలు బయటకు వచ్చాయి. అవేవో దొంగనోట్లు అనుకునేరు. అచ్చంగా ఆర్ బీ ఐ అచ్చొత్తిన  నోట్లు... బ్యాంకు నుంచి తాజాగా బయటకి వచ్చిన నోట్లు.. రూ. 2 వేల నోటు మీద అన్నీ బాగానే ఉన్నాయి. గాంధీ గారి బోసి నవ్వులు తప్ప... మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షియోపూర్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి ఓ రైతుకు ఇలా గాంధీ బొమ్మ లేని నోట్లు ఇచ్చారు. అతడు వాటిని తీసుకొని ఇంటికి వెళ్లాక తెలిసింది గాంధీ బొమ్మలేకుంటే నోట్లు చెల్లవని, తిరిగి బ్యాంకుకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. మరో రైతుకు ఇదే అనుభవం ఎదురైంది.

 

బ్యాంక్ అధికారులు వాళ్ల‌ నుంచి ఆ నోట్లను తీసుకొని ఆర్బీఐకి పంపారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆర్ బి ఐ ఆ క‌రెన్సీ న‌కిలీ కాద‌ని.. ముద్రణ పొరపాటు జరగడం వల్ల అలా వచ్చిందని వివరణ ఇచ్చారు.

 

కేవలం ముద్రణ లోపం వల్ల ఇలా జరిగిందా.. లేకుంటే కేంద్ర  ప్రభుత్వ పైలెట్ ప్రాజెక్టు పథకంలో భాగంగా ఇది జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

ఎందుకంటే పైలెట్ ప్రాజెక్టుగా పనులు చేపట్టడం... ఫలితం అనుకున్న విధంగా రాగానే అమలు చేయడం అనేది రాజకీయ నాయకుల తెలివైన ఎత్తుగడ.

నాటి ఎల్ పి జీ నమూనా నుంచి నేటి మేక్ ఇన్ ఇండియా వరకు అన్నీ ఈ కోవలోనివే.

 

గత కొన్నాళ్లుగా పథకం ప్రకారం భారత మొదటి ప్రధాని నెహ్రూ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ అదే సమయంలో పటేల్ ను ఆకాశానికి ఎత్తుతున్న కేంద్రం.. పరోక్షంగా కాంగ్రెస్ ఇమేజ్ ను దెబ్బతీస్తూనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కు అభయహస్తం లాంటి గాంధీని కూడా అదే పద్ధతిలో సాగనంపే ధోరిణి కనిపిస్తుంది.

దీనికి బాపు బొమ్మలేని కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ఒక ఉదాహరణ కావొచ్చు.

 

చరిత్రలో వివాదాస్పద వ్యక్తులుగా నిలిచిన మరాఠా యోధుడు శివాజీ , ఇండియన్ బిస్మార్క్ సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఘన చరిత్రలను ప్రపంచం మొత్తం వినిపించేలా బీజేపీ సర్కారు వారికి అతిపెద్ద విగ్రహాలను కట్టిస్తొంది. దానికోసం వేల కోట్లు తగిలేస్తుంది. ( ముఖ్యంగా చైనా అంటే గిట్టని పటేల్ విగ్రహం యొక్క సాంకేతిక బాధ్యతలను చైనాకే కట్టబెట్టింది మోదీ సర్కారు.) అయినా దీనిలో పెద్ద తప్పేం లేదు.

 

కానీ, శాంతియుత మార్గంలో బ్రిటీష్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించిన మహాత్ముడి ఏ జ్ఞాపకాన్ని విస్మరించినా అది జాతికి చేసిన తీరని ద్రోహం అని గుర్తుంచుకోవాలి.

Follow Us:
Download App:
  • android
  • ios