సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అధికారాలకు కత్తెర

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీఏ డిగ్రీ పై గత కొంతకాలంగా పెద్ద చర్చే జరగుతోంది. ఆయన అసలు డిగ్రీ నే చదవలేదని... ఎన్నికల అఫిడవిట్ లో పెట్టింది ఫేక్ డిగ్రీ అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సహా అనేకమంది విమర్శలు గుప్పించారు.

కొందరైతే సమాచార హక్కు చట్టం కింద కేంద్ర మానవవనరుల శాఖను సంప్రదించి ప్రధాని డిగ్రీ జిరాక్స్ కాపీ కావాలని పిటిషన్ కూడా వేశారు.

దీంతో హెచ్చార్డీ అప్పీలను చూసే మాడభూషి శ్రీధర్ ప్రధాని డిగ్రీ చదివినట్లుగా భావిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీకి లేఖ రాస్తూ మోదీతో సహా ఆయన బ్యాచ్ కు చెందిన అందరి సర్టిఫికేట్లను ఉచితంగా పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించారు.

అయితే ఆయన చేసిన పని ఢిల్లీ వర్గాలకు ఇబ్బంది కలిగించిందేమో ఏమో.. వెంటనే కేంద్ర మానవ వనరుల శాఖ అప్పీల పరిధి నుంచి మాడభూషిని తప్పించారు.

ప్రధాని డిగ్రీ వివరాలను ఈ దేశంలో ప్రతిఒక్కరు తెలుసుకునే హక్కు ఉంది. ఆ హక్కును కాపాడడానికి ప్రయత్నించిన మాడభూషి శ్రీధర్ పై చర్య తీసుకోవడం అంటే ప్రభుత్వం తమ పారదర్శకతకు పాతరవేయడమే అవుతుంది.

మాడభూషిని హెచ్చార్డీ పరిధి నుంచి తొలగించడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై స్పందిస్తూ మాడభూషిపై చర్య తీసుకోవడం అంటే వ్యవస్థపై దాడి చేయడమేనని విమర్శించారు.