Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ ఐటీ కంపెనీకి భారీ జరిమానా

జీతం తక్కువ ఇస్తున్నారని కంపెనీకి జరిమానా

Indian-American owned IT company fined for H1-B visa violations

హెచ్-1 బీ వీసా విషయంలో ట్రంప్ ప్రభుత్వం పెట్టిన కండీషన్స్ అన్నీ ఇన్నీ కావు.  తాజాగా హెచ్-‌1బీ వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు భారతీయ సంతతి వ్యక్తికి చెందిన ఐటీ కంపెనీకి అమెరికా ప్రభుత్వం జరిమానా విధించింది. 1,73,044 డాలర్ల జరిమానా చెల్లించాలని కాలిఫోర్నియాకు చెందిన ఈ కంపెనీని ఆదేశించింది.

కంపెనీలోని 12 మంది ఉద్యోగులకు వీసా నిబంధనలకు అనుగుణంగా జీతాలు చెల్లించడంలేదన్న కారణంతో ఈ జరిమానా విధించింది. 12 మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారత్‌కు చెందిన వారే ఉన్నారు.అమెరికాలోని కార్మిక వేతనాలకు సంబంధించిన విభాగం దర్యాప్తు చేపట్టి ఈ కంపెనీ మోసాన్ని బయటపెట్టింది.

క్లౌడ్‌విక్‌ టెక్నాలజీస్‌ ఐఎన్‌సీ అనే సంస్థ భారత్‌ నుంచి ఉద్యోగులను తీసుకొచ్చి వారికి చెప్పిన దానికంటే తక్కువ జీతం ఇస్తున్నారని వెల్లడించింది. వారికి నెలకు 8,300డాలర్లు ఇస్తామని హామీ ఇచ్చి కేవలం నెలకు 800 డాలర్లు మాత్రమే ఇస్తున్నారని గుర్తించింది. దీంతో ఆ కంపెనీకి 1,73,044డాలర్ల జరిమానా విధించింది.

ఐటీ కంపెనీలకు ప్రాచుర్యం పొందిన సిలికాన్‌ వ్యాలీలోనే ఈ కంపెనీ కూడా ఉంది. భారత సంతతికి చెందిన మణి ఛబ్రా సదరు కంపెనీ వ్యవస్థాపకులు, సీఈవో అని కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంది. బిగ్‌ డేటా, క్లౌడ్‌, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌, బిజినెస్‌ ఇంటలిజెన్స్‌, డేటా సైన్స్‌, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ తదితర సేవల్ని అందిస్తామని కంపెనీ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

అమెరికన్‌ ఉద్యోగుల కొరత ఉన్నప్పుడు కంపెనీలు తగిన జీతంతో ఇతర దేశాల నుంచి అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులకు హెచ్‌-1బి వీసాల ద్వారా ఉద్యోగాలిస్తున్నారు. సిలికాన్‌ వ్యాలీలో, హై-టెక్‌ వెంచర్స్‌లోని ఐటీ కంపెనీల్లో చాలా మంది విదేశీ ఉద్యోగులు ఈ వీసాలపైనే పనిచేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏటా 85వేల హెచ్‌-1బి వీసాలను జారీ చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios