బిర్యానీ తినడం నిషేధించాలంటున్న విలక్షణ నటుడు

విలక్షణ నటుడు కమల్ హసన్ ఏది చేసినా విలక్షణంగానే ఉంటుంది. తెరపైన దశావతారాలు చూపిస్తే తెర వెనక ‘విశ్వరూపం’ చూపంచగల సిసలైన ‘నాయకుడు’ ఆయన.

తమిళనాడులో ప్రఖ్యాతి చెందిన జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎందుకో మరి ఇది కమల్ కు అస్సలు నచ్చలేదు.

దీనిపై ఇండియా టు డే నిర్వహించిన సమావేశంలో స్పందించిన కమల్... తమిళుల సంప్రదాయమైన జల్లికట్టు అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. స్పెయిన్‌లో బుల్‌ఫైట్‌లా జల్లికట్టును చూడరాదని కోరారు. సంప్రదాయంగా కొనసాగించే జల్లికట్టును తిరిగి ప్రారంభించాలన్నారు.

అంతేకాదు స్పెయిన్‌లో ప్రజలు పశువులను గాయపర్చడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతాయనీ... అయితే తమిళనాడులో ఎద్దులను దేవుడిగా కొలుస్తారని, తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా భావిస్తారని గుర్తుచేశారు. జల్లికట్టు అంటే ఎద్దును మచ్చిక చేసుకోవడం మాత్రమేనని అన్నారు.

ఇంతటితో ఆగకుండా జల్లికట్టను నిషేధించారు కాబట్టి ఇక బిర్యానీ ని కూడా నిషేధించాలని అభిప్రాయపడ్డారు.

జల్లికట్టు అంటే ఇష్టం లేనివారు బిర్యానీ తినడం కూడా మానేయాలన్నారు. బిర్యానీ తయారీకి జంతువుల ప్రాణాలు తీస్తున్నారు కాబట్టి అది జల్లికట్టు కంటే ప్రమాదకరమని అభివర్ణించారు.

ఇలా జల్లికట్టుకు, బిర్యానీకి లంకె పెట్టి తన విలక్షణతను మరోసారి ప్రదర్శించారు ఈ విలక్షణ నటుడు.