దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మోటారు వాహనాల తయారీ సంస్థ హ్యుండాయ్‌ సరికొత్త మోడల్ కారును ప్రవేశపెట్టింది. ఎలైట్‌ ఐ20 సిరీస్‌లో ఈ మోడల్‌ను విడుదల చేసింది. 2018 ఎలైట్‌ ఐ20 పేరిట విడుదల చేసిన ఈ కారు ధర రూ.5.34లక్షల నుంచి రూ.9.15లక్షల(ఎక్స్‌-షోరూం దిల్లీ) మధ్య ఉంటుందని ప్రకటించింది. హ్యుండాయ్‌ రూపొందించిన గ్లోబల్‌ ఎలక్ట్రిక్‌ వాహనం ఐయోనిక్‌ను కూడా విడుదల చేసింది. దీనిలో 104 హెచ్ పీ పెట్రోల్/డీజిల్ ఇంజిన్ , 43 హెచ్ పీ ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు.

 

 ఎలైట్‌ ఐ20 కొత్త మోడల్‌ను మరింత అందంగా, సరికొత్త లుక్‌తో రూపొందించినట్లు హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ ఎండీ, సీఈఓ వైకే కూ విలేకరులకు తెలిపారు. పెట్రోల్‌ ఇంజిన్‌ కారు ధర రూ.5.34లక్షల నుంచి రూ.7.9లక్షల మధ్య ఉంటుంది. డీజిల్‌ ఇంజిన్‌ కారు ధర రూ.6.73లక్షల నుంచి రూ.9.15లక్షల మధ్య ఉంటుందని వెల్లడించారు. కారులో డ్యుయల్‌ ఎయిర్‌బ్యాగ్లు సహా పలు భద్రతా పరమైన ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్లను ఆరు రంగుల్లో అందజేస్తున్నారు.