Asianet News TeluguAsianet News Telugu

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతున్నదో చూడండి

మానవ హక్కుల ఉల్లంఘణ మీద నిజ నిర్ధారణ కమిటి రిపోర్టు వివరాలు

human rights brazenly violated in Sircilla district Telangana says rights body
నిజ నిర్ధారణ కమిటి రిపోర్టు

కమిటీ సభ్యులు:: జయ వింద్యాల, చంద్రన్న, డాక్టర్. షోయబ్, రియజుద్దిన్,విజయ్. రాజు గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో     జయ వింద్యాల, చంద్రన్న, డాక్టర్. షోయబ్, రియజుద్దిన్, విజయ్. రాజు గౌడ్   ఆధ్వర్యంలో ఏర్పడిన నిజనిర్ధారణ కమిటీ తేదీ 30/10/2017 నాడు జిల్లాలో పర్యటించింది. కమిటీ జిల్లాలో బాధితులను పరామర్శించి వివరాలు సేకరించింది. కమిటీ దృష్టికి వచ్చిన విషయాలు.


1) నెరేళ్ల సంఘటన...


 నేరెళ్ల గ్రామం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘటన వివరాల్లోకి వెళితే జూలై 2న నేరెళ్ల గ్రామానికి చెందిన ఎరుకల భూమయ్య(55) అనే రైతు ఎరువుల కోసం జిల్లెల క్రాసింగ్‌కి వెళ్లి మోటర్‌ సైకిల్‌పై తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఇసుక లారీ భూమయ్య మోటార్‌ సైకిల్‌ని ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గత రెండు సంవత్సరాల కాలంలో ఇసుక లారీలు గుద్దడం వల్ల ఐదుగురు చనిపోయారు. అందులో నేరెళ్ల గ్రామానికి చెందిన గంధం మల్లేశం(58), బొల్లవేని రమేష్‌(45), వడ్ల రవి(31), బంగారపు భూమయ్య(55), జిల్లెలకు చెందిన కారంగుల కరుణాకర్‌ రావు(32) ఉన్నారు. చాలా మంది గాయాలపాలయ్యారు. 

ఇదే ప్రాంతంలో వరుసగా ప్రమాదాలు జరిగిన ప్రతిసారి స్థానిక ప్రజలు ఈ దారి గుండా ఇసుక లారీలు నడుపవద్దని నిరసన తెలిపినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే క్రమంలో జూలై 2న భూమయ్య కూడా ఇసుక లారీ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలియడంతో నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాల ప్రజలు ఆవేదనకు లోనయ్యారు. తమ ప్రాణాలను తీస్తున్న లారీలపై దాడి చేశారు. ఈ దాడిలో నాలుగు లారీలు కాలిపోయాయి. మరో ఐదు లారీల అద్దాలు పగిలాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక ఎస్‌.ఐ. సైదారావు కానిస్టేబుళ్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడి ప్రజలను చెదరగొట్టడానికి ప్రయత్నించడంతో పోలీసులకు ప్రజలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఎస్‌.ఐ. పై అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఎస్‌.పి. విశ్వజిత్‌ కంపాటి, సి.ఐ. శ్రీనివాసరావు పోలీసు బెటాలియన్‌తో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రజలు చెదిరి పోకుండా ఆరు గంటలపాటు రోడ్డుపైనే కూర్చున్నారు. కాలుతున్న లారీల మంటలను ఆర్పడానికి వచ్చిన ఫైర్‌ ఇంజన్లను కూడా ప్రజలు అడ్డుకున్నారు. ఆయిల్‌ ట్యాంకులు పేలిపోతాయనడంతో వదిలారు. 
మరుసటి రోజు అనగా జూలై 3న నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాల ప్రజలు సిరిసిల్లలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బైటాయించారు.
స్థానిక పోలీసులు లారీ దగ్ధం కేసులో అనుమానితులు అనే పేరుతో నేరెళ్ల గ్రామంలోని ఇండ్లలోకి బలవంతంగా చొరబడి యువకులను పట్టుకుపోయారు. అడ్డుపడిన కుటుంబ సభ్యులతో ఎస్‌.పి. విశ్వజిత్‌ కంపాటి మాట్లాడి పంపిస్తామని చెప్పారు. పోలీసులు పట్టుకుపోయిన వారిలో పెంట బాలయ్య, కోలా హరీష్‌, చెప్యాల బాలరాజ్‌, పసుల ఈశ్వర్‌, గంధం గోపాల్‌, బత్తుల మహేష్‌, చికోటి శ్రీనివాస్‌, గణేష్‌లు ఉన్నారు. తమ పిల్లలు సాయంత్రమైన తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు జూలై 6న ఎస్‌.పి.ని కలిశారు. ʹమీరు గనుక మీ పిల్లలకోసం రోడ్డెక్కితే మీ పిల్లలు శవాలుగా వస్తారʹని బెదిరించి పంపించారు. 8వ తేదీన ఎనిమిది మందిని సిరిసిల్ల కోర్టులో హాజరుపరిచి జైలుకు తీసుకెళ్లారు. తీవ్రగాయాలతో వచ్చిన వారిని చూసిన జైలర్‌ జైల్లో పెట్టుకుంటే వారికి ఏమవుతుందోననే భయంతో చికిత్సకోసం తిప్పిపంపారు. పోలీసులు వారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించి మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకువచ్చి జైలుకు పంపారు.

కుటుంబ సభ్యులు జూలై 10న జైలుకెళ్లి కలిశారు. తమ పిల్లల ఒంటిపై ఉన్న దెబ్బలకు చలించిపోయారు. పట్టుకెళ్లినప్పటి నుండి వరుసగా నాలుగు రోజులు కొట్టారని యువకులు తెలిపారు. కొట్టే క్రమంలో సొమ్మసిల్లి పడిపోతే కరెంట్‌ షాక్‌లిచ్చి లేపి కొట్టారన్నారు. రోకలిబండలెక్కిచ్చి తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసినట్లుగా తెలిపారు. చిత్రహింసలకు గురిచేసిన విషయాన్ని ఎక్కడైనా చెపితే మీ కుటుంబంలోని మహిళలపై వ్యభిచారం కేసు పెడతామని, గంజాయి కేసు పెడతామని, ఎన్‌కౌంటర్‌ చేస్తామని ఎస్‌.పి. బెదిరించారని తెలిపారు. ఇసుక మాఫియాని కాపాడటం కోసం ప్రజలపై దాడికి పాల్పడిన పోలీసులపై ఇప్పటివరకూ తగిన చర్యలు లేవు. బాధితులకు న్యాయం దక్కలేదు.

2)రిమాండు ఖైదీ కడమంచి వెంకటేష్ పోలీసుల చిత్రహింసలకు చనిపోవడం


      వేములవాడ వాస్తవ్యుడైన, బుడగజంగాల కులానికి చెందిన కడమంచి వెంకటేష్(28) ఎల్లారెడ్డి పేట పోలీసులు,సిరిసిల్ల CCS టౌన్ పోలీసులు తేదీ 7/7/2017 నుండి 13/7/2017 వరకు చిత్రహింసలు పెట్టారు. దొంగతనం ఒప్పుకొమ్మని బలవంతపెట్టారు.ఇతడిని తేదీ 13/7/2017 నాడు రేమాండు ఖైదీగా కరీంనగర్ జైలుకు పంపించారు. అప్పడికే తీవ్రగాయాలపాలు అవటం చేత అతడిని జైలు అధికారులు తేదీ 26/7/2017 నాడు కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. తేదీ 3/8/2017 నాడు అతడి చేతులకు బెడ్డుకు బేడీలు కట్టివుండగానే ప్రాణాలు విడిచాడు.పోలీసుల తనని కూడా ఏమైనా చేస్తారేమో అన్న భయంతో  వెంకటేష్ భార్య రేణుక ఊరు విడిచి వెళ్ళిపోయింది. తన కుమార్తె సమ్మక్క ను తన అన్న దగ్గర ఉంచి పాలుతాగే బాబు జంపన్నతో ఊరు విడిచి వెళ్ళిపోయింది. కమిటీ తన తనకోసం జిల్లాకు వచ్చిందని తెలుసుకొని కమిటీని ఆశ్రయించింది. అయితే ఆమె కూతురును తన అన్న 15000 రూపాయలకు అమ్మివేశాడు. కమిటీ సహాయంతో స్టేషన్లో ఫిర్యాదు చేసి తిరిగి తన బిడ్డను పొందింది. మొత్తానికి పోలీసుల అతి ప్రవర్తన వల్ల రేణుక జీవితం రోడ్డునపడింది.


3) పోలీసులు చిత్రహింసలు పెట్టి చేయని నేరాన్ని మోపడం వల్ల అవమాన భారంతో ఆటో డ్రైవర్ రాజు ఆత్మహత్య

రాజు ఆటో నడుపుకుంటూ వేములవాడలో బాలానగర్ లో నివాసిస్తున్నాడు. ఇతడు తేదీ  న పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు. అదే రోజు రాజును వేములవాడ పోలీసులు తీసుకెళ్లి ఒక మొబైల్ దొంగతనం కేసు ఒప్పుకొమ్మని చిత్రహింసలు పెట్టారు. అవమాన భారంతో అతడు అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు కట్టుకథ రాశారు.తన భార్యతో బలవంతపు సంతకాలు తీసుకున్నారు.


4) ఫేసుబుక్కులో కామెంట్ పెట్టాడని కక్ష సాధింపు. చాయ్  బండి నడుపుకునే వెల్డండి సదానందం పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్ తెరిచారు.
ఇతడు ఫేస్ బుక్ లో పోలీసులను కించపరిచేలా కామెంట్ పెట్టాడని తేదీ 25/4/2017 నాడు వేములవాడలో ని ఇతడి ఇంటి నుండి ఎత్తుకుపోయారు.  29/4/2017 వరకు స్టేషన్లో ఉంచుకుని చిత్రహింసలు పెట్టారు. ఇతడిపై తప్పుడు కేసులు పెట్టి రౌడి షీట్ తెరిచారు. ఇతడి భార్యపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
డిమాండ్స్:: మానవ హక్కుల ఉల్లంఘన కు కారకులైన/ బాధ్యులైన పోలీసులను శిక్షించాలి

#బాధితులకు ఆర్థిక న్యాయం, సామాజిక భద్రతను ప్రభుత్వం వెంటనే కల్పించా లి

# సామాన్య ప్రజల పై తప్పుడు కేసులు పెట్టే పోలీసుల పై తక్షణ చర్యలు తీసుకునే విధంగా విధి విధానాలను ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి
 

రిపోర్టు మీద సంతకాలు చేసిన వారు

జయ వింద్యాల,
 చంద్రన్న, 
డాక్టర్. షోయబ్, 
రియజుద్దిన్, 
విజయ్
రాజు గౌడ్
ఇక్బాల్ ఖాన్, సలీం, యాకూబ్

Follow Us:
Download App:
  • android
  • ios