రోహిత్ వేములను భారత మాత ముద్దు బిడ్డగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు ఆ బిడ్డ మరణానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కి అవార్డు ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అక్షర సేద్యం చేసే విశ్వవిద్యాలయంలో... కులం కుమ్ములాటలకు బలైపోయిన విజ్ఞాన కెరటం రోహిత్ వేముల...
పాలకుల వివక్ష ధోరిణిని అతని మరణం ప్రశ్నిస్తూనే ఉంటుంది. దానికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండడం ఒక నేరం అయితే అతని ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తులను శిక్షించాల్సింది పోయి గౌరవించడం మరో నేరం.
ఈ రెండు నేరాలను ఏకకాలంలో చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావుకి ప్రధాని నరేంద్రమోదీ అవార్డు ఇచ్చి సత్కరించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తిరుపతిలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో అప్పారావుకు... ప్రధాని నరేంద్ర మోదీ అవార్డు ఇస్తుంటే పక్కనే ఏపీ సీఎం చంద్రబాబు ఆయన భుజం తట్టి ప్రోత్సహిస్తుండడం గమనార్హం.
రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకుడైనట్టు అప్పారావు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
అలాంటి వ్యక్తిని అరెస్టు చేసి శిక్షించాల్సిందిపోయి, అవార్డులిచ్చి ఎలా సత్కరిస్తారని దేశవ్యాప్తంగా మోదీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘రోహిత్ వేముల భారతమాత బిడ్డ' అని గతంలో పేర్కొన్న మోదీ ఇప్పుడు ఆ భారత మాత ముద్దు బిడ్డ శ్వాసను ఆపిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలా గౌరవిస్తారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావుకి చంద్రబాబు దగ్గరుండి ప్రధాని మోదీ చేత అవార్డు ఇప్పిండం దారుణమని పేర్కొన్నాయి.
