డ్యాన్స్ చేస్తే.. శరీరాకృతిని మెరుగుపురుచుకోవచ్చు.. అనే విషయం మనకు తెలుసు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కూడా డ్యాన్స్ చక్కగా సహకరిస్తుందని ఇప్పటికే పలు సర్వల్లో వెల్లడయ్యింది. ఇప్పుడు తాజాగా డ్యాన్స్ గురించి మరో విషయం బయటపడింది.డ్యాన్స్ కారణంగా తెలివితేటలు అమోఘంగా వృద్ధి చెందుతాయట!

కోవెంట్రీ విశ్వవిద్యాలయానికి చెందిన మైకేల్‌ డన్కన్‌ బృందం చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  కొందరు యువతీ యువకులను ఎంపిక చేసి వారితో ‘సాల్సా’ నృత్యం చేయించారు. తర్వాత వారికి మెదడుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. కాగా.. డ్యాన్స్ తర్వాత వారిలో గ్రహణశక్తి 8%, ఏకాగ్రత 13%, జ్ఞాపకశక్తి 18% మెరుగుపడినట్లు గుర్తించారు.

 ‘‘నృత్యం మెదడుకు మేధో సవాలు విసురుతుంది. సంగీతానికి అనుగుణంగా శరీరం వంపులు తిరగడం... అవగాహనాశక్తి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మేళవింపుతోనే సాధ్యమవుతుంది. డాన్స్‌ చేస్తున్నప్పుడు మెదడు-శరీరం నడుమ అత్యుత్తమ సమన్వయం కుదురుతుంది. ఆలోచనాశక్తి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. మనో వికారాలు వదిలిపోతాయి. శరీర కదలికలు వేగవంతమవుతాయి’’ అని పరిశోధకులు చెబుతున్నారు.