ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదు అనుమతి కోరినా, పోలీసుల కాపలాలోనే యాత్ర అనుమతి లేని యాత్రలకు ప్రజలు దూరంగా ఉండాలి

కాపు రిజర్వేషన్ ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రలో ఎవరూ పాల్గొన కుండా ప్రభుత్వం కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంటూ ఉంది. ఈ నెలాఖరున అంతర్వేది నుంచి అమరావతి దాకా సాగనున్న ముద్రగడ యాత్రకు అనుమతి లేదని అందువల్ల ఎవరూ పాల్గొనరాదని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆయన గురువారం నాడు అమరావతి విలేకరులతో మాట్లాడుతూ ఉద్యమాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకవేళ ముద్రగడ తన పాదయాత్రకు అనుమతి కోరినా ,పోలీసుల ఆధ్వర్యంలో పాదయాత్ర జరిపిస్తామని చినరాజప్ప అన్నారు.

ఇది ఇలాంటే డీజీపీ సాంబశివరావు కూడా ఏలూరులో ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదని తెలిపారు. అనుమతి లేని కార్యక్రమాలకు అందరూ దూరంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ నెల 20 వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో సెక్షన్‌ 143,30 అమల్లో ఉంటుందన్నారు.

మరొక వైపు కాపు నేతలు మాాత్రం యాత్ర అపేది లేదని స్పష్టం చేశారు. కాపులకు బిసి హోదా మీద ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయడం లేదని అందువల్ల ముద్రగడ పోరాటానికి తాము సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నామని రాష్ట్ర కాపు జెఎసి పేర్కొంది. జెఎసి నేతలు నిన్న విజయవాడలో మావేశమయి పాదయాత్రలకు అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాదయాత్ర కృష్ణా జిల్లా రోడ్ మ్యాప్ ను నిన్ననే విడుదల చేసిన సంగతి తెలిసిందే.