ఎంత ద్వేషించినా  మనకు బాగా దగ్గిరయిన ప్రపంచ రాజకీయ నాయకులపేర్లలో హిట్లర్  ఒకటి.  ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా  చాలా మందికి హిట్లర్ తో ఇదే సాన్నిహిత్యం ఉంది.

చాలా మంది నియంతలు వచ్చారు, పోయారు. అయితే, బాగా గుర్తుండిపోయిన, మనకు ఇష్టమయిన పేరూ ఒక్కటే. అదే హిట్లర్. అవతలి వాడిని తిట్టేందుకేకాదు, మనల్ని మనం పోల్చుకునేందుకు కూడా హిట్లర్ పేరునే వాడుతుంటాం. హిట్లర్ పేరుతో సినిమా తీస్తే కూడా జనం బాగానే చూశారు.

అంతెందుకు, తెలంగాణా ఏర్పడిన రెండోనేలలోనే ముఖ్యమంత్రి కెసిఆర్... తాను సర్దార్ పటేల్లా అవుతాననో, నెహ్రూ అవుతాననో, అథమం ఎంజీఆర్ అవుతాననో అనలేదు, అవసరమయితే, హిట్లర్ నవుతానని అన్నాడు. అంతకు ముందు ప్రతిపక్షమోళ్లు ఆయన్ని హిట్లర్ అన్నారు.

 ఎంత ద్వేషించినా మనకు బాగా దగ్గిరయిన ప్రపంచ రాజకీయ నాయకుల పేర్లలో హిట్లర్ ఒకటి. ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా చాలా మందికి హిట్లర్ తో ఇదే సాన్నిహిత్యం కనబడుతుంది. . జర్మనీలో ఇంకా ఎక్కువ. ఈ మధ్య హిట్లర్ ఆత్మకథ ‘మయిన్ కాంఫ్’ అచ్చేస్తే జర్మన్లు ఎగబడి కొన్నారు.

సందర్భవివరణలతో, విశేషాలతో ఉన్న ‘మయిన్ కాంఫ్’ ఎన్ని కాపీలు అమ్ముడవోయిందో తెలుసా... గత ఏడాది అచ్చేసినప్పటినుంచి జనవరి అరో తేదీదాకా 85000. అచ్చేసినపుడల్లా కాపీలు చేతుల మీది నుంచే అలా అలా ఎగిరిపోయాయి.

రెండు వేల పేజీల బరువున్నా, రు. 4235.91 (59 యూరోలు)లతో ధర మోపేడున్నాలెక్కచేయకుండా జర్మన్లు ఈ పుస్తకం కొని చదువుతున్నారు. మానవజన్యుప్రయోగాలు, సినిమాలు, సిఫిలిస్ వ్యాధి మీద హిట్లర్ జాత్యహంకార అభిప్రాయాలు ఉన్న ఈ పుస్తకం చాన్నాళ్ల తర్వాత జర్మన్లను కూడ కొనేందుకు కవ్విస్తూ ఉంది.

అయితే, ఇదేదో నాజీజం పునరాగమనం అని ఆందోళన చెందాల్సిన పనిలేదని ముద్రాపకులు అంటున్నారు. ‘ మయిన్ కాంఫ్’ వేలం వెర్రికి కారణం, ఈ పుస్తకం 70 సంవత్సరాల తర్వాత జర్మనీలో, అందునా జర్మన్ లో, అచ్చు కావడమే నని వారి వాదన.

మొదటి సారి ‘మయిన్ కాంఫ్ ’ జర్మన్ భాషలో అచ్చయింది 1945లో. ప్రపంచమంతా అనువాదాలు చెలరేగుతున్నా, పుట్టిన గడ్డ మీద ‘మయిన్ కాంఫ్’ నర్ముద్రణ నోచుకోలేదు. ఈ పుస్తకాన్ని చాలా ప్రమాదకరమయిన వస్తువుగా భావించి బవేరియా స్టేట్ లైబ్రరీలో ఒక విష పేటికలో భద్రపరిచారు.ఎగా దిగా పరీక్షించిన తర్వాత మాత్రమే సందర్శకులను ఈ పుస్తకం దగ్గరకు అనుమతిస్తారు.

నిజానికి, జర్మనీ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించిందేమీ లేదు. కాకపోతే,కాపిరైట్ తనదే కాబట్టి మరొకరు ముద్రించడానికి వీల్లేకుండా చూసిందట.

ఒక ఏడాది కిందట కాపీరైట్ గడువు ముగియడంతో, ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపొరరీ హిస్టరీ , వివరణాత్మకంగా, హిట్లర్ జాత్యహంకార ధోరణిని విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ ఈ పుస్తకాన్ని అచ్చేసింది. నిజానికి మొదటిసారి అచ్చేసింది నాలుగు వేల ప్రతులే. తర్వాత వరసగా అనేక సార్లు ముద్రించాల్సి వచ్చింది.