ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో.. మరో బైక్ ని విడుదల చేసింది. నోయిడాలో  మూడు రోజులుగా ఆటో ఎక్స్‌ పో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆటో ఎక్స్ పోలో  హీరో ఈ సరికొత్త బైక్‌ను ప్రదర్శించింది.  200 సీసీ సామర్థ్యంగల ఈ బైక్ పేరు ఎక్స్‌ పల్స్‌ గా ప్రకటించింది. ఈ బైక్‌తో పాటు రెండు కొత్త స్కూటర్లు మాస్ట్రో ఎడ్జ్‌ 125, డ్యుయెట్‌ 125 లను కూడా ప్రదర్శించింది. భవిష్యత్తులో ప్రీమియం మోటార్‌సైకిల్‌, స్కూటర్‌ విభాగాల్లో దృష్టి సారించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎక్స్‌ పోలో ప్రదర్శనకు ఉంచిన ఎక్స్‌ పల్స్‌, రెండు స్కూటర్లను ఈ ఏడాదిలో విడుదల చేయనున్నట్లు హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌, ఎండీ, సీఈఓ పవన్‌ ముంజల్‌ వెల్లడించారు. గత రెండు నెలల్లో హీరో మోటోకార్ప్‌ ఏడు కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది.