కువైట్‌లో భారతీయులే ప్రధాన టార్గెట్

పొట్టకూటి కోసం పరాయి దేశానికి వచ్చిన వలసదారులపై కువైట్‌‌లో దాడులు పెరుగుతున్నాయి.

 

ప్రధానంగా భారతీయులనే టార్గెట్‌గా చేసుకుని దోపిడీకి దిగుతున్నారు. భారతీయులు ఎక్కువగా నివసించే అబ్బాసియా వంటి ప్రాంతాల్లో ఈ నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి.

 

ఇటీవల ఫైహా క్లినిక్‌లో పనిచేసే ఓ భారతీయుడిపై నలుగురు అరబ్బులు దాడిచేసి పర్సు, నగదు దొంగిలించుకుపోయిన సంఘటన వలసదారుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.

 

గతవారం భవన్స్ స్కూల్ వద్ద తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన సుబ్బరాజుపై కొందరు దుండగులు దాడికి దిగారు. పెద్దమొత్తంలో డబ్బును చోరీ చేశారు. అబ్బాసియాలోనే బెస్ట్ బేకరీ వద్ద రాత్రి 9గంటల సమయంలో ఓ భారతీయ మహిళను అడ్డగించి, బెదిరించి భయపెట్టి ఆమె వద్ద నుంచి డబ్బును దోచుకున్నారు.

 

ఇలా భారతీయులే టార్గెట్‌గా ఇటీవల నేరాలు జరుగుతున్నాయి. పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదని భారతీయులు వాపోతున్నారు. ఈ విషయమై కువైట్‌లోని ఇండియన్ ఎంబసీకి కూడా వారు ఫిర్యాదు చేశారు. భారతీయులు, వలసదారులు ఉండే ప్రాంతాల్లో సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎంబసీ అధికారులు కోరారు.