కేంద్రంపై చంద్రబాబు పోరు: మూడు రోజులు ఢిల్లీలోనే గవర్నర్

Governor Delhi tour for three days
Highlights

కేంద్రంపై చంద్రబాబు పోరు: మూడు రోజులు ఢిల్లీలోనే గవర్నర్

హైదరాబాద్: ప్రత్యేక హోదాపై, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమరభేరీ మోగించిన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పరిస్థితులను ఆయన ఢిల్లీ పెద్దలకు వివరిస్తారని చెబుతున్నారు. అయితే, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపైనే ఆయన ఢిల్లీ పెద్దలకు నివేదించే అవకాశం ఉంది. ఆయన హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మాత్రమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు.

ఢిల్లీకి రావాల్సిందిగా నరసింహన్ కు సోమవారం ఆదేశాలు వచ్చాయి. మంగళవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. గత నెలలో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ పర్యటన ఇదే. ఈ పర్యటన ఆకస్మికమని అంటున్నారు. 

కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ తో పాటు ఇంటలిజెన్స్ వర్గాలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ఇప్పటికే నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ పై కూడా గవర్నర్ ఢిల్లీ పెద్దలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా కెసిఆర్ కర్ణాటకకు చెందిన జెడిఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామిలతో సమావేశమయ్యారు. 

విభజన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడంపై నెలకొన్న పరిస్థితులను కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. హైకోర్టు విభజన ఇప్పటికీ జరగకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. కేంద్ర విధానాలపై కేసిఆర్ బహిరంగ విమర్శలు చేస్తున్నారు. 

loader