మ్యాగీ నూడుల్స్ నుంచి హార్పిక్ టాయిలెట్ క్లీనర్  వరకు అన్ని తారల తళుక్కులతో మార్కెట్ లోకి వెళ్లువెత్తేవే.. వాటి  ప్రమాదాల గురించి  ఏ పరిశోధన కంపెనీనో హెచ్చరిస్తే తప్ప మనకు తత్వం అర్థంకాదు.. ఆ లోపు హీరోకు కోట్లు , అభిమానులకు పాట్లు మిగులుతాయి.

మన దేశంలో మ్యాజిక్ కంటే మంత్రాలే ఎక్కువ ఫేమస్... డాక్టర్ల కంటే బాబా లకే ఎక్కువ డిమాండ్ ... రియల్ హీరోల కంటే రీల్ హీరోలకే ఎక్కువ ఇమేజ్...


అభిమాన తార వెండితెర మీద వెలగగానే గుండెలు చీల్చుకొనే వీరాభిమానులున్నారిక్కడ... హీరో పిలుపు ఇస్తే రక్తం దానం చేసే అభిమానులున్నారిక్కడ.. రాజకీయాల్లోకి వస్తే ఆస్తులమ్మి గెలిపించే అభిమానులున్నారిక్కడ.

ఒక్క ముక్కలో చెప్పాలంటే అభిమాన తార ను అనుసరించడంలో అభిమానులకుండే కిక్కే వేరప్ప...

అందుకే హీరో ఏ కూల్ డ్రింక్ తాగుతాడో అదే ఆర్డర్ ఇస్తాడు అభిమాని... అలా తన అభిమానాన్ని పలువురి ముందు ప్రదర్శించడానికి తెగ తాపత్రయపడిపోతుంటాడు.

అందుకే కార్పొరేట్ కంపెనీలు కూడా అలాంటి అభిమానులను ఆకట్టుకోడానికి తెగ ప్రయత్నిస్తుంటాయి.

హీరోలకు కోట్లకు కోట్లు ఇచ్చి తమ ప్రకటనలో నటింపచేసుకుంటాయి. వాటిని చూసిన అభిమానులు తమ హీరో ప్రొడక్ట్ అని కొనడానికి క్యూ కడుతుంటారు.

మ్యాగీ నూడుల్స్ నుంచి హర్పిక్ టాయిలెట్ క్లీనర్ వరకు అన్ని తారల తళక్కులతో మార్కెట్ లోకి వెళ్లువెత్తేవే.. వాటి నాణ్యత గురించి ఏ పరిశోధన కంపెనీనో హెచ్చరిస్తే తప్ప మనకు తత్వం అర్థంకాదు.. ఆ లోపు హీరోకు కోట్లు అభిమానులకు పాట్లు మిగులుతాయి..

మెగాస్టార్ చిరంజీవి నాడు థమ్స్ అప్ యాడ్ చేస్తే ఆహా...ఓహో అన్నాం.. మనం కూడా ఆ కూల్ డ్రింక్ ను తెగ తాగేశాం.. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 లో చిరంజీవి అలాంటి కోలా కంపెనీ పై యుద్ధం చేస్తుంటే ఆహా.. ఓహో అంటున్నాం..

హీరోలు ఆలోచించకపోయినా అభిమానులైనా కాస్త ఆలోచించాల్సింది.. మనం అభిమానులుగా కంటే ముందు ఆత్మగౌరవం ఉన్న మనుషులమని... మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుందని..

రీల్ వేరు.. రియాలిటీ వేరు అని వాదిస్తే ఇంకేం చేయలేం... గురివింద గింజ నీతలు చెప్పేవారిని నమ్మే గొర్రెలను రక్షించలేం.