పీకలదాకా మందు తాగి.. రోడ్లమీద గొడవలు చేయడం.. వాహనాలు నడపటం లాంటివి చాలా మందే చేస్తుంటారు. అలాంటి వాళ్లను పోలీసులు పట్టుకోవడం.. గట్టిగా క్లాస్ పీకీ.. ఎంతో కొంత ఫైన్ వేసి  వదిలిపెట్టడం పరిపాటి. ఇలానే.. రోజూ తాగి రోడ్డుపై నానా గొడవలు చేస్తున్న మందుబాబులకి ఏలూరు డీస్పీ ఏమని సలహా ఇచ్చాడో తెలుసా..? ఇంకెందుకు ఆలస్యం చదవండి.

‘‘ మందు తాగాలంటే తాగండి.. కాకాపోతే ఇంట్లో కూర్చొని తాగండి. రోడ్డు మీద తాగడం, తాగి రోడ్లమీద అల్లర్లు చేయడం, వాహనాలు నడపటం లాంటివి చేస్తే మాత్రం తాట తీస్తాన’’ని డీస్పీ  ఈశ్వరరావు మందుబాబులను హెచ్చరించాడు.. నగరంలో రెండురోజుల నుంచి రాత్రివేళ పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీ నిర్వహించారు. పట్టుబడిన 50 మందికి డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం డీఎస్పీ ఈశ్వరరావు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం మద్యం తాగినవారు వల్లే జరుగుతున్నాయని, మరణించిన వారిలో 50 శాతం మంది మద్యం తాగినవారే ఉంటున్నారని డీఎస్పీ తెలిపారు. కొంతమంది విద్యార్థులు రాత్రివేళ బర్త్‌డే పార్టీల పేరుతో రోడ్లపైకి వచ్చి కేక్‌ కటింగ్‌ చేస్తున్నారని, ఇలాంటి అల్లరి పనులకు పాల్పడితే సహించేది లేదన్నారు. రాత్రివేళ గుంపులుగా తిరిగినా, పోలీసులు అరెస్టు చేస్తారని చెప్పారు. మొదటిసారి మద్యం తాగి పట్టుబడినవారిని అరెస్టు చేసి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని, వారి స్నేహితులకు కూడా తెలియజేస్తామన్నారు.

అనంతరం కోర్టులో హాజరుపరిచి జరిమానాతో వదిలేస్తామని, రెండోసారి పట్టుబడితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని, మూడోసారి పట్టుబడితే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.