ఎక్కువ సైక్లింగ్ చేయడం వల్ల  లైంగిక సమస్యలు తలత్తే అవకాశం ఉందని.. గతంలో కొన్ని సర్వేలు వెలువడ్డాయి. అయితే.. అది వాస్తవం కాదని తేలింది. సైక్లింగ్ తో లైంగిక సమస్యలు తలెత్తడం అనేది కేవలం ఒక అపోహేనని తాజా సర్వేలో వెల్లడయ్యింది. సైకిల్‌ తొక్కటం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయని శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు తేల్చారు. స్విమ్మింగ్, రన్నింగ్‌ చేసే వారితో పోలిస్తే సైక్లింగ్‌ చేసేవారికి లైంగిక పటుత్వం ఎక్కువగా ఉంటున్నట్లు తేలిందని వీరు చెబుతున్నారు.

సైక్లింగ్‌తో గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండటంతోపాటు కీళ్ల సమస్యలు కూడా తగ్గుతాయన్నారు. సైక్లింగ్ చేసే వారిలో బరువు సంబంధ సమస్యలు కూడా చాలా వరకు దూరమైనట్లు పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్‌ బెంజమిన్‌ బ్రేయర్‌ వివరించారు. 2,774మంది సైక్లిస్టులు, 539మంది స్విమ్మర్లు, 789 మంది రన్నర్స్‌ పై సర్వే చేసి ఈ నిర్థారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు.