వైసీపీ నేత లక్ష్మీపార్వతి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఇద్దరు వ్యక్తులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. ఆమె తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని.. తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తులు? వారిని లక్ష్మీపార్వతి ఎందుకు బెదిరిస్తున్నారు..?

అసలు విషయం ఏమిటంటే..లెజెండరీ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ఇప్పుడు రెండు మూడు సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించగానే రాజకీయంగా కలకలం మొదలైంది. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నారు. ఇవి కాక.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి  ధీటుగా ‘ లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే మరో సినిమా తీస్తున్నట్లు డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు. దీంతో.. తన అనుమతి లేకుండా తన పేరుమీద సినిమా ఎలా తీస్తారంటూ లక్ష్మీ పార్వతి ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఆ సినిమా తీయడానికి వీలు లేదని కూడా ఆమె చాలా సార్లు చెప్పారు.

అయితే.. తాజాగా ఆ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, నిర్మాత విజయ్ కుమార్ గౌడ్ లు బుధవారం డీజీపీ సాంబశివరావను కలిశారు. రాత్రి సమయంలో తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ వారు ఫిర్యాదు చేశారు. లక్ష్మీ పార్వతి నుంచి తమకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించమని కోరారు.  దీంతో నిజంగా లక్ష్మీపార్వతి వారిని బెదిరిస్తున్నారా అనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.