ఎట్టకేలకు ఎపికి ప్రత్యేక హోదాపై స్పందించిన చిరంజీవి

Chiranjeevi reacts on special category status
Highlights

ఎట్టకేలకు ఎపికి ప్రత్యేక హోదాపై స్పందించిన చిరంజీవి

అమరావతి: ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడుకుతున్నప్పటికీ మౌనం వహించిన మెగాస్టార్, కాంగ్రెసు నేత చిరంజీవి ఎట్టకేలకు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికైనా ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. 

పనిచేసేవారికి కాంగ్రెసు పార్టీలో ఎప్పుడూ మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అఖిల భారత కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా, ఒడిశా రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన గిడుగు రుద్రరాజు శనివారం చిరందజీవిని కలిశారు. 

తాను చిరంజీవిని మర్యాదపూర్వకంగానే కలిశానని గిడుగు రుద్రరాజు చెప్పారు. ఈ సమయంలో చిరంజీవి రుద్రరాజును అభినందించినట్లు పిసిసి ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఆందోళనకు దిగినప్పటికీ, రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్నప్పటికీ చిరంజీవి మౌనంగానే ఉండిపోయారు. ఆయన మౌనంపై కొద్ది మంది ప్రశ్నలు కూడా వేశారు. సైరా నరసింహా రెడ్డి చిత్రం షూటింగులో ఆయన మునిగిపోయి, దాదాపుగా రాజకీయాలకు దూరమైనట్లు కనిపించారు. 
loader