టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించిన వాణి వాణి స్పీడ్ కి బ్రేక్ వేసిన చంద్రబాబు గొంతు తగ్గించిన వాణి విశ్వనాథ్
అలనాటి అందాల తార వాణి విశ్వనాథ్ కి చంద్రబాబునాయుడు గట్టి షాక్ ఇచ్చారా? అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. అందుకే వాణి.. తన గొంతు కాస్త తగ్గించింది అనేది ప్రజెంట్ టాక్.
అసలు విషయం ఏమిటంటే.. వాణి విశ్వనాథ్ టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించి దాదాపు మూడు నెలలు దాటింది. అయినప్పటికీ ఆమె ఇప్పటి వరకు పార్టీలో చేరింది లేదు. కానీ చేరడం మాత్రం కన్ఫామ్ అని మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ చెబుతోంది. ఆమె పార్టీలో చేరడం అనేది పత్రికలకే పరిమితమౌతోంది. అయితే.. మొన్నామధ్య కాస్త డోస్ పెంచి మరీ మాట్లాడింది. వైసీపీ మహిళా నేత రోజాకి వ్యతిరేకంగా నగరిలో పోటీ చేసేందుకు తాను సిద్ధమని కూడా ప్రకటించింది. పదిమంది రోజాలతోనైనా తాను పోటీపడేందుకు సిద్ధమని కూడా చెప్పింది. దీంతో.. రోజాకీ పోటీగానే వాణిని టీడీపీలో చేర్చుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.
అయితే.. వాణి విషయంలో చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆమె ఇప్పటివరకు పార్టీలో చేరింది లేదు. చేరినా వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తారో, ఇవ్వరో అనే గ్యారెంటీ లేదు. కానీ ఆమె మాత్రం వాళ్లతోపోటీ పడ్తా, వీళ్లతో పోటీ పడతా అని స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తోంది. పార్టీలో చేరకముందే ఇంత దూకుడుగా ఉంటే.. చేరిన తర్వాత ఆమెను అదుపుచేయడం కష్టమని టీడీపీ నేతలు భావిస్తున్నారట. ఇదే విషయాన్ని చంద్రబాబు చెవిన కూడా వేశారట. దీంతో ఆయన రంగంలోకి దిగారు. మధ్యవర్తిత్వుల ద్వారా వార్నింగ్ ఇప్పించారు.
దీంతో.. వాణి కాస్త వెనక్కి తగ్గింది. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి.. పార్టీలో ఏ పాత్ర పోషించాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది ముఖ్యమంత్రే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలని తనకెప్పటి నుంచో ఉందని, తెలుగు ప్రజలపై ఉన్న అభిమానంతోనే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకపోయినా చంద్రబాబుకే మద్దతు తెలుపుతానని స్పష్టం చేశారు. ఎవరికి వారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో డిసైడ్ అయిపోతే ఇక చంద్రబాబు ఉన్నది ఎందుకు? అందుకే వాణి స్పీడ్ కి బ్రేక్ వేశారు. దీంతో..చంద్రబాబు దెబ్బకి.. వాణి కి దిమ్మతిరిగినట్టు ఉందని చర్చించుకుంటున్నారు.
