ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తెలుగు వారి తడాఖా ఏంటో చూపించాల్సిన సమయం దగ్గరపడిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం  ఏపీపై చూపిస్తున్న వివక్షపై  ప్రత్యేకంగా మాట్లాడారు. తన రాజకీయ అనుభవాన్నంతా వాడి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా చేస్తానన్నారు. ఎవరు సహకరించక పోయినా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడుపుతానని తెలిపారు. ప్రధాని సహకరించి వుంటే మరో 5 సంవత్సరాల్లోనే దక్షిణభారతంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ది పర్చే వాడినని, కానీ అలా జరక్క పోవడంతో రాష్ట్రాభివృద్దికి మరో పదిసంవత్సరాలు పట్టేలా ఉందన్నారు. అయినా నిరాశ చెందకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళతానని తెలిపారు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ ని కూడా చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. నరేంద్ర మోదీకి మరో నాలుగు సీట్లు తక్కువగా వచ్చి వుంటే అప్పుడు చెప్పినట్లు వినేవాడని, ఇప్పుడు పూర్తి మొజారిటీ ఉంది కాబట్టి తమ మాట వినడం లేదన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రాన్ని బిడ్డల్లా బావించి తల్లి ప్రేమ చూపించాల్సిన ప్రధాని ఆంధ్ర రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి ఇచ్చినన్ని నిధులు కూడా రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇవ్వలేదని, దీన్ని బట్టే అతడు సొంత రాష్ట్రంపై చూపించే ప్రేమ ఇతర రాష్ట్రాలపై చూపించడం లేదని స్పష్టంగా తెలుస్తోందన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తుంటే ప్రధాని తొత్తులు ఆయన భజన చేయడం మానడంలేదని, వారికి కూడా ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏపికి అన్యాయం చేస్తున్న ఏ ఒక్క పార్టీని గానీ, మనుషుల్ని గానీ వదలబోమని చంద్రబాబు హెచ్చరించారు.


ఇక తాను చేపట్టిన ధర్మ పోరాట దీక్షను  కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలు, అన్ని పక్షాలు ఈ పోరాట దీక్షకు మద్దతిచ్చినప్పటికి కొందరు తమ రాజకీయాలకోసం ఈ దీక్షపై విమర్శలు చేశారని చంద్రబాబు తెలిపారు. తాను అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ, సైబరాబాద్ , విమానాశ్రయాలను నిర్మించానని, అదే అనుభవంతో అమరావతిని కూడా నిర్మిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.