నేనిచ్చిన నీళ్లు తాగుతూ నాపైనే విమర్శలా: బాబు, సాక్షిపైనా ఫైర్

Chandrababu lashes out at YCP and Sakshi
Highlights

నేనిచ్చిన నీళ్లు తాగుతూ నాపైనే విమర్శలా: బాబు, సాక్షిపైనా ఫైర్

పోలవరం: తాను ఇచ్చిన నీళ్లను తాగుతూ తనపైనే విమర్శలు చేస్తారా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కుప్పం కన్నా ముందుగా పులివెందులకే నీళ్లు ఇచ్చామని, అయితే తాను ఇచ్చిన నీళ్లను తాగుతూ తనపైనే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

సోమవారంనాడు ఆయన పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రికపై కూడా ఆయన మండిపడ్డారు. తనపై ఆ పత్రిక విషం చిమ్ముతోందని అన్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాను నాలుగేళ్లు ఓపిక పట్టానని, ఈ నాలుగేళ్లు సామబేధదానోపాయాలు ప్రయోగించానని,  ఇప్పుడు దండోపాయానికి దిగానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా వీళ్లందరూ రాజకీయాల్లో తనకన్నా జూనియర్లు అని వ్యాఖ్యానించారు. 

ఎపికి ప్రత్యేక హోదాపై ప్రధాని తిరుమల వెంకన్నకు సమాధానం చెప్పాలని అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా డిమాండుపై ఈ నెల 30వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. 

పోలవరం దేశంలోనే అరుదైన ప్రాజెక్టు అని, జూన్ నాటికి కాపర్ డ్యామ్ పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అదనంగా 9200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. ఇప్పటికకే 5500 కోట్లు ఇచ్చారని, ఇంకా కేంద్రం నుంచి 2900 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని అన్నారు. 

ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని కోర్టులకు వెళ్తున్నారని అన్నారు. తన కష్టానికి ఐదు కోట్ల మంది ప్రజలే సమాధానం చెప్పాలని అన్నారు. 

loader