దేశజనాభా దృష్టిని మళ్లించటమో లేక ఆకర్షించటమో చేస్తే గానీ వచ్చే ఎన్నికల్లో గట్టెక్కటం కష్టమని మోడికి అర్ధమైనట్లుంది. అందుకనే పేదలను ఆకర్షించేందుకు నగదు బదిలీ పథకం అనే కొత్త పథకం గురించి కేంద్రం యోచిస్తున్నట్లు లీకులు ఇస్తున్నారు.

దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం నగదుబదిలీ పథకాన్ని అమలు చేయాలని అనుకుంటున్నదా? అందుకు అమలవుతున్న సంక్షేమపథకాలకు మంగళం పాడుతారా? వెలువడుతున్న వార్తల ప్రకారం వచ్చే బడ్జెట్ నాటికి సంక్షేమ పథకాల రద్దుపై కేంద్రప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న పథకాల స్ధానంలో యునివర్సల్ బేసిక్ ఇన్కం(యూబిఐ)అనే కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. దేశంలోని ప్రతీ పేదవానికి నెలకు ఇంత అని కనీస మొత్తంలో నగదు అందించటమే యూబిఐ ముఖ్య ఉద్దేశ్యం.

ప్రస్తుతం అమలులో ఉన్న అనేక సంక్షేమ పథకాల్లో పూర్తిగా పేదలే లబ్దిపొందుతున్నారన్న నమ్మకం కేంద్రానికి లేదట. దేశజనాభాలో సుమారు 30 శాతం పేదలున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇపుడు అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతున్నది. యూబిఐ పథకం అమలుకు ఓ అంచనా ప్రకారం ఏడాదికి రూ. 4.32 లక్షల కోట్లు అవసరం. కాబట్టి అమల్లో ఉన్న అన్నీ పథకాలను రద్దు చేసి ఒక్క యూబిఐని మాత్రమే అమలు చేస్తే సరిపోతుందని మోడి భావిస్తున్నట్లు సమాచారం. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి వ్యక్తిగత ప్రచారం కోసం అమలు చేస్తున్న పథకాలేగానీ నిజంగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకం కూడా ప్రారంబించలేదు. పైపెచ్చు పెద్ద నోట్ల రద్దుతో యావత్ దేశాన్ని గడచిన రెండు మాసాలుగా ఇబ్బందుల్లోకి నెట్టేసారు.

దాంతో ప్రజావ్యతిరేకత పెరిగిపోతోంది. ఇటువంటి సమయంలో దేశజనాభా దృష్టిని మళ్లించటమో లేక ఆకర్షించటమో చేస్తే గానీ వచ్చే ఎన్నికల్లో గట్టెక్కటం కష్టమని మోడికి అర్ధమైనట్లుంది. అందుకనే పేదలను ఆకర్షించేందుకు నగదు బదిలీ పథకం అనే కొత్త పథకం గురించి కేంద్రం యోచిస్తున్నట్లు లీకులు ఇస్తున్నారు. గతంలో రాష్ట్రంలో చంద్రబాబు కూడా నగదు బదిలీ పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ఇటువంటి పథకాల వల్ల ప్రజల్లో సోమరితనం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న భారత్ వంటి దేశాలకు ఈ పథకాలు ఏ రకంగానూ ఉపయోగం కాదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.