విభజన సమస్యలు తేలటమంటే చిన్న విషయం కాదు. కానీ ప్రయత్నంలో చిత్తశుద్ది ఉంటే కానిది లేదు కదా.
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో ఎట్టకేలకు పంచాయితీ మొదలవుతోంది. యూపిఏ ప్రభుత్వం చేసిన అడ్డగోలు విభజన కారణంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు రావణకాష్టంలాగ మండుతూనే ఉంది. పంచాయితీ చేసే ఉద్దేశ్యంతో ఒకసారి గవర్నర్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దానికి తోడు కేంద్రం చెప్పినా ఇరు రాష్ట్రాలూ వినలేదు. చివరకు న్యాయస్ధానాల ముందుకు వివాదాలు వెళ్లినా ఉపయోగం కనబడలేదు. అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులదే తప్పు.
రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సిఎంలకు లేకపోవటమే ప్రధాన సమస్య. దాంతో ప్రభుత్వాలు ఏర్పడి రెండున్నరేళ్ళయినా ఇంకా సమస్యలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి గవర్నర్ బాగానే ఉన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు బాగానే ఉన్నారు. కాకపోతే రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగులే నలిగిపోతున్నారు. షెడ్యూల్ 9, 10 సంస్దల విభజన, హై కోర్టు విభజన, నీటి పంపకాలు, ఆస్తులు, అప్పులు, విద్యుత్ తదితర అనేక సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి.
ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి మొన్న జనవరి 26వ తేదీన రాజభవన్ లో జరిగిన సమావేశంలో గవర్నరే చొరవ తీసుకుని ఇద్దరు సిఎంలతో ప్రస్తావించారు. దాంతో కెసిఆర్, చంద్రబాబునాయుడులు ఇద్దరూ సానుకూలంగా స్పందించటంతో భేటీ జరగాలని నిర్ణయమైంది. ఫిబ్రవరి 1వ తేదీన తన ఆధ్వర్యంలోనే ఇరు రాష్ట్రాల మంత్రులతో కమిటి వేయాలని గవర్నర్ చేసిన సూచనతో కమిటీ కూడా ఏర్పాటైంది. ఏపి తరపున యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, తెలంగాణా తరపున మంత్రి హరీష్ రావు తదితరులు బుధవారం రాజ్ భవన్ లో సమావేశమవుతున్నారు. విభజన సమస్యలు తేలటమంటే చిన్న విషయం కాదు. కానీ ప్రయత్నంలో చిత్తశుద్ది ఉంటే కానిది లేదు కదా.
