శేఖర్ రెడ్డి ద్వారా చంద్రబాబు నోట్ల మార్పిడి: బొత్స ఆరోపణ

Botsa finds fault with Chandrababu's deeksha
Highlights

శేఖర్ రెడ్డి ద్వారా చంద్రబాబు నోట్ల మార్పిడి: బొత్స ఆరోపణ

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన దీక్షపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు దీక్ష చేసింది ప్రత్యేక హోదా కోసం కాదని, తన పుట్టిన రోజును అధికారికంగా నిర్వహించుకున్నారని ఆయన అన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వప్రయోజనాలే చూసుకుంటున్నాయని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పారట్ీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు ఆయన తెలిపారు.తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేశారని ఆయన గుర్తు చేశారు. 

జపాన్ తరహా పోరాటాలు చేయాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ధర్మదీక్ష అంటూ సినిమా పేర్లు పెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు రాష్ట్రం కోసం దీక్ష చేయలేదని ప్రజలు గుర్తించాలని అన్నారు. బిజెపి, టిడిపి కలయిక వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిందని, ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టాయని ఆయన అన్నారు. 

రాజకీయ జిమ్మిక్కులతో ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాజా పరిణామాలు కూడా వారి చీకటి ఒప్పందాల్లో భాగమేనని అన్నారు. 

శేఖర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా చంద్రబాబు నోట్ల మార్పిడి చేశారని బొత్స ఆరోపించారు. నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీకీ చంద్రబాబును కన్వీనర్ గా పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 
loader