కర్ణాటక ఎన్నికలు: గాలి సోదరులకు బిజెపి టికెట్లు

BJP fields another brother of Gali Janaradhan Reddy in Karnataka polls
Highlights

 కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరో సోదరుడికి కూడా బిజెపి టికెట్ లభించింది. 

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరో సోదరుడికి కూడా బిజెపి టికెట్ లభించింది. శాసనసభ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి సోదరులు ఇరువురు బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. గాలి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి బిజెపి నాయకత్వం టికెట్ ఖరారు చేసిన బిజెపి తాజాగా గాలి కరుణాకర్ రెడ్డిని కూడా బరిలోకి దింపడానికి నిర్ణయం తీసుకుంది. 

బిఎస్ యెడ్యూరప్ప నాయకత్వంలోని బిజెపిలో దశాబ్దం క్రితం గాలి సోదరుల హవా కొనసాగింది. గాలి సోదరులు ముగ్గురిలో కరుణాకర్ రెడ్డి గతంలో బళ్లారి నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. శుక్రవారం నాడు బిజెపి 59 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ జాబితాలో కరుణాకర్ రెడ్డి పేరు చోటు చేసుకుంది. 

బళ్లారిలోని హర్పనహళ్లి నుంచి కరుణాకర్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ సీట్లోనే ఆయన 2008 ఎన్నికల్లో కాంగ్రెసు నుంచి పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి ఎంపి ప్రకాశ్ ను ఓడించారు.  వెంటనే ఆయన యెడ్యూరప్ప మంత్రివర్గంలో చేరారు. 

దక్షిణాదిన కర్ణాటకలో బిజెపి విజయానికి పాదులు వేసింది గాలి సోదరులేనని అంటారు. ఆ తర్వాత వారు యెడ్యూరప్పకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. గాలి జనార్దన్ రెడ్డిపై పలు కేసులు ఉన్నాయి. అక్రమ మైనింగ్ కేసులు ఆయనపై నమోదయ్యాయి. గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బి. శ్రీరాములు కూడా బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. 

కరుణాకర్ రెడ్డిని శాసనసభ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే కాంగ్రెసు బిజెపిపై విమర్శలకు దిగింది. అవినీతి రాజకీయ నాయకులకు బిజెపి ఎన్నికల బరిలోకి దింపుతోందని విమర్శించింది. అయితే బిజెపి తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. అటువంటి సంఘటన ఇదొక్కటేనని, ఈ విషయంలో రాజీ పడ్డామని చెప్పింది. 

యెడ్యూరప్ప తన పాత బృందాన్ని మళ్లీ బిజెపికి చేరువ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న కట్టా సుబ్రమణ్య నాయుడు, కృష్ణయ్య శెట్టిలకు కూడా టికెట్లు ఇప్పించుకున్నారు. 

కర్ణాటకలో తిరిగి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బిజెపి గాలి సోదరులకు శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిందని చెప్పవచ్చు. బళ్లారిలో గాలి సోదరుల హవా ఉంది. దాంతో బిజెపి రాజీ పడినట్లు చెబుతున్నారు. 
 

loader