‘టీ’ ఈ పేరు చెబితే చాలా మంది ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. ఉదయం లేవగానే ఒక కప్పు   టీ కడుపులో పడితే గానీ.. చాలా మంది మంచం దిగరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక చలికాలంలో అయితే..  ఇక చెప్పనక్కర్లేదు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి టీ తాగితా వచ్చే మజానే వేరు. అయితే.. ఈ చలికాలంలో మాములు టీ కాకుండా.. ఒక్కసారి అల్లం టీ తాగి చూడండి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమౌతుంది. అవునండి.. అల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం, ఇతర మినరల్స్ ఉంటాయి. ఇవి మానవాళికి ఎంతో ఉపయోగం చేస్తాయి. ఇక అల్లం టీ చేసుకోని అందులో కొద్దిగా తేనె, లేదా నిమ్మరసం కలుపుకొని తాగితే.. ఆరోగ్యానికి ఇంకా మేలు.

అల్లం టీ వల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం..

1.చాలా మందికి ప్రయాణాలు చేసేటప్పుడు కడుపులో వికారంగా అనిపిస్తుంది.అప్పుడప్పుడు వాంతి కూడా చేసుకుంటారు. అలాంటి వారు ప్రయాణానికి ముం దు ఒక కప్పు అల్లం టీ తీసుకుంటే కడుపులో తిప్పడం, వాంతి వంటివి తగ్గుతాయి.
 

2. కొందరికి ఆహారం అంత త్వరగా జీర్ణం కాదు. అందుకు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో భోజనం తరవాత ఒక కప్పు అల్లం టీ తీసుకోండి. కడుపులోకి వెళ్లిన ఆహారం ఇట్టే అరిగిపోతుంది.

3.చలికాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య ముక్కు దిబ్బడ, శ్వాస సరిగా పీల్చుకోలేకపోవడం. అల్లం టీతో వీటికి స్వస్తి పలకొచ్చు. జలుబు చేసినా, ముక్కు దిబ్బడ ఉన్నా ఒక కప్పు వేడి వేడి అల్లం టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.


4.అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉంటాయి. కాబట్టి రోజూ ఒక కప్పు అల్లం టీ తీసుకుంటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

5.రోజూ ఒక కప్పు అల్లం టీ తీసుకోవడం వల్ల మీ ఒత్తిడిని కాస్త తగ్గించుకోవచ్చు. అల్లం టీ నుంచి వచ్చే ఆ మంచి వాసనను ఆస్వాదిస్తూ తాగితే ఒత్తిడి నుంచి మీకు ఉపశమనం ఉంటుంది.