బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగా యాపిల్ సంస్థ.. భారత్ లోని తమ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను పెంచేసింది.

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్ కి చెందిన ఐఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2018 బడ్జెట్ లో దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. దీని ఎఫెక్ట్ ఇప్పటికే ప్రారంభైంది. బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగా యాపిల్ సంస్థ.. భారత్ లోని తమ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను పెంచేసింది. దాదాపు అన్ని ఐఫోన్ మోడళ్లపై 3శాతం ధర పెరిగింది.ఈ పెంపుతో ఐఫోన్‌ ఎక్స్‌ 256జీబీ వేరియంట్‌ ధర రూ.3000 నుంచి రూ.3200 వరకు పెరిగింది. దీంతో అంతకముందు రూ.1,05,720గా ఉన్న ఈ ఫోన్‌ ధర ప్రస్తుతం, రూ.1,08,930గా అయింది.

ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6 ఎస్‌ ధరలు కూడా 1100 రూపాయలు, 1350 రూపాయల మేర పెరిగాయి. దీంతో ఐఫోన్‌ 6 ధర రూ.31,900గా, ఐఫోన్‌ 6ఎస్‌ ధర రూ.42,900గా మారింది. భారత్‌లో ప్రస్తుతం 16 మోడల్స్‌ ను ఆపిల్‌ విక్రయిస్తోంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. తన వెబ్‌సైట్‌లో కూడా మారిన ధరలనే పొందుపరిచింది.