రాష్ట్ర ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ ఆనంద ల‌హిరి పేరిట వినూత్న కార్య‌క్ర‌మానికి  శ్రీకారం చుడుతోంది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయిడి ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల మేర‌కు ఈ కార్య‌క్ర‌మం రూపుదిద్దుకుంద‌ి

తెలుగు భాషా సంస్కృతుల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా, నేటి యువ‌త‌కు మార్గ నిర్దేశ‌క‌త్వం చూప‌గ‌లిగేలా రాష్ట్ర ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ ఆనంద ల‌హిరి పేరిట వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతోంది. ఈనెల మూడ‌వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల‌లో ఈ విశేష కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించనున్నారు.

ఈ విషయాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.సాంస్కృతిక శాఖ సంచాల‌కులు డాక్ట‌ర్ విజ‌య‌భాస్క‌ర్ ఈ కార్య‌క్ర‌మాల‌ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తార‌ని ఆయన చెప్పారు. మొదట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ఈకార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని భావించినా తొలి ద‌శ‌లో పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా ముఖ్య కేంద్రాల‌లోని పుర‌పాల‌క సంఘాల‌లోనే చేప‌డుతున్నామ‌న్నారు.

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయిడి ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల మేర‌కు ఈ కార్య‌క్ర‌మం రూపుదిద్దుకుంద‌ని, నేటి యువ‌త‌ను తెలుగుద‌నానికి ద‌గ్గ‌ర చేయ‌ట‌మే కార్య‌క్ర‌మ కీల‌క ఉద్దేశ్య‌మ‌ని ముఖేష్ కుమార్ వెల్ల‌డించారు. ఆనంద ల‌హ‌రి నిర్వ‌హించే 13 ప్రాంతాల‌కూ సాంస్కృతిక శాఖ ఇప్ప‌టికే క‌ళా బృందాల‌ను కేటాయించింద‌ని, క‌నీసం నాలుగు గంట‌ల‌కు త‌గ్గ‌కుండా కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌న్నారు. నిపుణులైన క‌ళాకారుల‌తో పాటు ఔత్సాహికుల‌కు కూడా ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌లో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని, ప్ర‌ధానంగా విద్యార్ధులు, యువ‌త త‌మ‌వంతు భూమిక‌ను పోషించాల‌న్న‌దే కార్య‌క్ర‌మ ముఖ్య ఉద్దేశ్య‌మ‌ని మీనా స్ప‌ష్టం చేసారు.

స్ధానిక యువ‌త‌కు ఈ ఆనంద ల‌హ‌రి కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక అవ‌కాశాలు ఉంటాయ‌ని, వారు త‌మ స‌హ‌జ‌సిద్ద‌మైన నిపుణ‌త‌ను ఈ వేదిక ద్వారా ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చ‌ని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వారిలో నిభిడీకృతం అయి ఉన్న నైపుణ్య‌త‌ను వెలికి తీసేలా కార్య‌క్ర‌మ రూప‌క‌ల్ప‌న జ‌రిగింద‌ని. వారు పెయింటింగ్‌, సంగీతం, నృత్యం వంటి అంశాల‌తో పాటు క్రీడా వికాసానికి దోహ‌దం చేసే అంశాల‌ను కూడా ఆనంద‌ల‌హ‌రిలో ప్ర‌ద‌ర్శించి ఆహుతుల మెప్పును పొంద‌వ‌చ్చ‌న్నారు. ప్ర‌భుత్వ ప‌రమైన ప‌ధ‌కాల ప్ర‌చారం కోసం అవ‌స‌మైన సాహిత్యాన్నికూడా పొందుప‌రిచేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.