ఎమ్మెల్యేలకు ‘పోలవరం’ క్లాస్.. ఎన్నికల స్టంటేనా?

First Published 16, Nov 2017, 11:29 AM IST
AP Ministers and MLAs Tour to Polavaram
Highlights
  • పోలవరం, పట్టిసీమ ప్రజెక్టులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • గురువారం ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్యేలు

రానున్న ఎన్నికలను ఎదురుకునేందుకు చంద్రబాబు మాష్టర్ ప్లాన్ వేశారా? అందులో భాగంగానే ఎమ్మెల్యేలకు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల దగ్గరికి తీసుకువెళ్తున్నారా..? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

అసలు విషయం ఏమిటంటే.. అసెంబ్లీ సమావేశాలకు నాలుగు రోజులు విరామం లభించింది. శాసనసభ, శాసనమండలి రెండూ తిరిగి సోమవారం ప్రారంభం అవుతాయి. దీంతో.. గురువారం ఉదయం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ పోలవరం ప్రాజెక్టు దగ్గరికి ప్రభుత్వం తీసుకొని వెళ్లింది. విజయవాడ నుంచి వీరంతా ఉదయం 7గంటలకు బయలుదేరి అక్కడికి వెళ్లారు. ఎలాగు ప్రతిపక్ష నేతలు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వరు కాబట్టి.. కేవలం మిత్రపక్షాలైన టీడీపీ,బీజేపీ నేతలు మాత్రమే అక్కడికి వెళ్లారు.  ముందు పట్టిసీమ, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టులను వారు పరిశీలిస్తారు. ప్రాజెక్టు విస్తృతి, ఇంజినీర్ సామర్థ్యం, జరుగుతున్న పనులు ఇవన్నీ వారు తెలుసుకోవడానికి చంద్రబాబు ఈ కార్యక్రమం చేపట్టారు.

అయితే.. ఇక్కడే చంద్రబాబు తన తెలివిని ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు దగ్గర నుంచి పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను  పరిశీలిస్తే.. దాని గురించి వాళ్లకు ఒక ఐడియా వస్తుంది. 2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు కాబట్టి..వారంతా దీనిని ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందని సమాచారం. అంటే.. ఎన్నికల ప్రచారంలో.. ఈ పోలవరం ప్రాజెక్టు  నిర్మాణం  ఎలా జరుగుతుందో, ఎప్పటికి పూర్తౌతుందో, ఎన్ని ఎకరాలకు సాగు నీరు అందుతుంది లాంటి విషయాలను ప్రజలకు వివరించే అవకాశం ఉంది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కేవలం చంద్రబాబు వల్లే అవుతందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తీసుకువచ్చే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే సడెన్ గా ఈ పోలవరం క్లాస్ ల ప్రోగ్రామ్ పెట్టారని టాక్.

loader