అఖిలప్రియ వల్ల ఇరకాటంలో పడ్డ లోకేష్

అఖిలప్రియ వల్ల ఇరకాటంలో పడ్డ లోకేష్

మంత్రి అఖిలప్రియకి.. మరో మంత్రి లోకేష్ మద్దతుగా నిలిచారు. ఆమెను మంత్రి వర్గం నుంచి తొలగించడం లేదని స్పష్టం చేశారు. కృష్ణా నదిలో పడవ బోల్తా ఘటనలో ఆమెను బాధ్యురాలిని చేస్తూ.. మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై లోకేష్ ఈ రోజు స్పందించారు.

అసలు మంత్రివర్గ విస్తరణ ప్రతిపాదన లేదని, అఖిల ప్రియను మంత్రి పదవి నుంచి తొలగించడం లేదని స్పష్టం చేశారు.  అంతేకాదు.. అఖిలప్రియ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, బెలూన్ ఫెస్టివల్, సోషల్ మీడియా సమ్మిట్ కార్యక్రమాలు బాగా నిర్వహించారని మెచ్చుకున్నారు కూడా. అయితే.. లోకేష్ మాటలపై విమర్శలు మొదలయ్యాయి. అసలు మంత్రి విస్తరణ గురించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు ముఖ్యమంత్రికే ఉంటుంది. ఎంత ముఖ్యమంత్రి కుమారుడైతే మాత్రం.. మంత్రి వర్గ విస్తరణ ఉందో లేదో లోకేష్ ఎలా చెబుతారు? అంటూ పలువురు విమర్శిస్తున్నారు చూడబోతే.. చంద్రబాబు కూడా లోకేష్ అడుగు జాడల్లోనే నడుస్తున్నారు కాబోలు అనే వాదనలు వినపడుతున్నాయి.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. అఖిలప్రియ విషయంలో లోకేష్ చెప్పిన మాటలపై కూడా పలు విమర్శలు వినపడుతున్నాయి. బెలూన్ ఫెస్టివల్, సోషల్ మీడియా సమ్మిట్ కార్యక్రమాలను అఖిల ప్రియ.. బ్రహ్మాండంగా నిర్వహించారని మంత్రి లోకేష్ చెప్పారు. అయితే..ఈ రెండూ కార్యక్రమాలు కూడా వివాదానికి గురైన సంగతి లోకేష్ మర్చిపోయినట్టున్నారు. బెలూన్ ఫెస్టివల్ లో రెండో రోజు బెలూన్లు సరిగా ఎగరనేలేదు. ఇక సోషల్ మీడియా సమ్మిట్ అవార్డు దీపికా పదుకొణెకి ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. అలాంటి కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి అని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page