రోడ్డుపై బజ్జీలు వేసిన మంత్రి జవహర్ వైరల్ గా మారిన వీడియో
ఏపీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కే ఎస్ జవహర్.. రోడ్డుపై బజ్జీలు వేసుకుంటున్నారు. అయ్యో పాపం.. ఆయనకి అంత ఖర్మ ఏమి వచ్చిందబ్బా అని అనుకుంటున్నారా. అదేమీ లేదండి..పార్టీ ప్రచారంలో భాగంగా ఆయన అలా చేశారు. ‘ఇంటింటికీ తెలుగు దేశం’ కార్యక్రమంలో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి మండలం..కొమ్ముగూడెంలో మంత్రి పర్యటించారు.
ఆయన గ్రామంలో పర్యటిస్తుండగా.. రోడ్డుపై బజ్జీలు వేయడం గమనించారు. దీంతో బజ్జీలు వేసే వ్యక్తిని లేపి.. ఆ స్థానంలో ఆయన కూర్చున్నారు. వెంటనే సలసల కాగే నూనెలో బజ్జీలు వేయడం మొదలుపెట్టారు. గతంలో బజ్జీలు వేసిన అనుభవం బాగా ఉందో ఏమో.. బజ్జీలు అమ్మే వ్యక్తి కన్నా.. బాగా మంత్రే వేశారు. అక్కడున్న వారంతా.. మంత్రి పనితీరుకి చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. ‘‘మంత్రిగారు బజ్జీలు బాగానే వేస్తున్నారే’’ అని ఓ వ్యక్తి అనగా.. ‘బజ్జీ పిండి కాస్త పలుచగా ఉందండి’ అని బదులిచ్చారు మంత్రి జవహర్. ఆయన వెంట జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కూడా ఉన్నారు. ఆయన బజ్జీలు వేస్తున్న వీడియో.. ప్రస్తుతం వైరల్ అయ్యింది.
