ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వాహానాలను ప్రవేశపెట్టే  విషయం మీద ప్రత్యేక అధ్యయనం చేసేందుకు  టొయోట  మోటార్స్  సుముఖత వ్యక్తం చేసింది. ఈ విషయం రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేశ్  ప్రకటించారు. అయితే, ఈ లోపు ప్రయోగాత్మకంగా విద్యుత్ వాహనాలను తిరుమల, విశాఖ, అమరావతిలలో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.

గురువారం నాడు  విజయవాడ సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. నారా లోకేష్ సమక్షంలో విద్యుత్‌ వాహనాలకు సంబంధించి  టయోటా ఎండీ హకిటో టచీబానా,ఐటి సెక్రెటరీ విజయానంద్ మధ్య అవగాహన ఈ  ఒప్పందం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతోషంగా ఉన్నాం,
ఏపీలో విద్యుత్‌ వాహనాలు ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలు అధ్యయనం చేస్తాం అని టొయోటా ఎండీ హకిటో టచీబానా అన్నారు.
భారత దేశంలో విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టడానికి పలు సమస్యలు ఉన్నాయి,విద్యుత్‌ వాహనాల అమలుకు అవసరమైన వాతావారణాన్ని  అన్ని రాష్ట్రాలు సృష్టించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మాట్టాడుతూ లోకేశ్ చెప్పారు.‘‘అన్ని రాష్ట్రాలు పర్యావరణహిత వాహనాలను వినియోగంలోకి తేవాలి.అత్యధిక విద్యుత్‌ వాహనాలు వినియోగిస్తున్న రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు తేవాలనే లక్ష్యంతో ఉన్నాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు.2018 మే నుంచి డిసెంబర్ లోపు అధునాతన టెక్నాలజీ తో రూపొందించిన 10 ఎలక్ట్రిక్ కార్లను టయోట  కంపెనీ రాష్ట్రానికి ఇస్తుంది.టయోట సంస్థ ఉచితంగా ఇచ్చిన వాహనాలను సీఆర్డీఏ పరిధిలో
ప్రయోగాత్మకంగా వినియోగిస్తాం’ అని లోకేష్ అన్నారు.

‘టొయోట సంస్థ ఒక్క ఏపీ ప్రభుత్వంతో తప్ప మరే రాష్ట్రంతోను ఒప్పందం చేసుకోలేదు,విద్యుత్‌ ఛార్జింగ్‌ వాహనాల ద్వారా కాలుష్య సమస్యను అధిగమించవచ్చు.త్వరలోనే ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ లో ఉన్న బ్యాటరీ తయారీ కంపెనీల నుండి వాహనాల తయారీ కంపెనీ వరకూ ఉన్న పూర్తి ఎకో సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చే విధంగా ఎలెక్ట్రిక్ వాహనాల పాలసీ తీసుకురాబోతున్నాం,’ అని కూడా  మంత్రి నారా లోకేష్ అన్నారు.

ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేందుకు కూడా ఒక నూతన విధానం రూపొందిస్తున్నామని అంటూ త్వరలోనే ఎలెక్ట్రిక్ వాహనాలను తిరుమల లోనూ, విశాఖపట్నం, అమరవతిలోనూ పెద్ద ఎత్తున వినియోగించబోతున్నాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు.