తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ఎంసెట్ ఫ‌లితాల్లో ఆంధ్రా ప్రాంత విద్యార్థులు స‌త్తా చాటారు. ఇంజ‌నీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్ -ఫార్మ‌సీ రెండు విభాగాల్లోనూ టాప్ 2 ర్యాంకుల్లో ఆంధ్ర విద్యార్థులు నిలిచారు.  ఇంజ‌నీరింగ్ విభాగంలో టాప్ 10లో 5 ర్యాంకులు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు కైవ‌సం చేసుకున్నారు. ఇందులో టాప్ 1, టాప్ 2 ర్యాంకులు ఆంధ్ర వారికే ద‌క్కాయి. ఇక తెలంగాణ వారికి టాప్ టెన్త్ లో 4 ర్యాంకులు ద‌క్క‌గా త‌మిళ‌నాడు విద్యార్థి ఒక స్థానాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఈ కేట‌గిరీలో గుంటూరు జిల్లాకు చెందిన గోరంట్ల జ‌యంత్ హ‌ర్ష మొద‌టి ర్యాంకు సాధించ‌గా... శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లారి రామ్ ప్ర‌సాద్ 2వ ర్యాంకులో నిలిచారు. 

 

ఇక అగ్రిక‌ల్చ‌ర్ ఫార్మ‌సీ విభాగంలోనూ ఆంధ్రా విద్యార్థులు స‌త్తా చాటారు. టాప్ 10లో 5 ర్యాంకులు వారికే ద‌క్కాయి. ఇందులోనూ టాప్ 1, 2 ర్యాంకులు సీమాంధ్ర విద్యార్థులే ద‌క్కించుకున్నారు. టాప్ 10లో మిగిలిన 5 ర్యాంకుల‌ను తెలంగాణ విద్యార్థులు కైవ‌సం చేసుకున్నారు.  ఈ విభాగంలో తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన క‌మిడిశెట్టి వి.ఎన్‌.వి.ఎస్‌. నేస్తం రెడ్డి మొద‌టి ర్యాంకులో, ప్ర‌కాశం జిల్లాకు చెందిన గొల్ల‌మూడి ప‌ర‌దీప్ సుంద‌ర్ రెండో ర్యాంకు సాధించారు. 

 

 తెలంగాణ ప్ర‌భుత్వం గ‌తంలో నిర్వ‌హించిన ఎమ్సెట్ లో కుంభ‌కోణాలు జ‌రిగి అభ్య‌ర్థుల‌కు 160కి 160 మార్కులు సాధించిన దాఖ‌లాలు ఉండ‌గా ఈసారి మాత్రం ఎవ‌రికీ 160 రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక ఇదే త‌ర‌హాలో ఎంపి ఎంసెట్ లోనూ తెలంగాణ విద్యార్థులు ప‌లువురు టాప‌ర్లుగా నిల‌వ‌డం తెలిసిందే.  గ‌తంలో ఏ ప‌రీక్ష‌లోనూ బాలిక‌ల‌దే పైచేయిగా నిలిచేవారు. కానీ ఈసారి తెలంగాణ ఎంసెట్ లో టాప్ 10లో వ‌రుస‌గా బాలుర‌దే పైచేయిగా నిలిచింది. న‌యా ట్రెండ్ ఎంత‌కాలం నిలుస్తుందో చూడాలి.